క్రిష్ణా వరదనీటి ఉదృతిని ఎదుర్కోవాలి..


Ens Balu
3
Guntur
2021-08-01 12:54:39

నాగర్జునసాగర్ ప్రాజెక్టు నుండి భారీ మొత్తంలో నీటి విడుదల కారణంగా కృష్ణానదిలో వరదనీటి ఉదృతి పెరగనున్న నేపథ్యంలో జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల గ్రామాలలో, లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన సహాయకచర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాలు, లోతట్టు గ్రామాలలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి తో కలిసి రెవెన్యూ, పంచాయితీ, వ్యవసాయ, పశుసంవర్థక, ఇరిగేషన్, విద్యుత్, వైద్య,ఆరోగ్యశాఖ, పోలీస్ అధికారులతో టెలికాన్ఫర్ ద్వారా ఆదివారం మధ్యాహ్నానం సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో వరదనీటి ఉధృతి పెరుగుతుందని ఆదివారం అర్ధరాత్రి కి ఐదులక్షల క్యూసెక్యుల వరద నీరు నాగర్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే అవకాశం ఉందన్నారు. నాగర్జునసాగర్ నుంచి విడుదలైన వరద నీరు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రవహిస్తున్నందున కృష్ణానదికి సమీపంలో గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల, మాచవరం, గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్ళూరు, తాడేపల్లి,  తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, బట్టిప్రోలు, రేపల్లే మండలాలోని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. 

వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, మండల, డివిజన్ స్థాయిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.   వరద నీటి ముంపుపై సంబంధిత గ్రామ ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను ముందస్తుగా అలెర్టు చేయాలన్నారు.   కృష్ణానదికి సమీపంలో ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలలోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.  కృష్ణానది వరద నీటి ఉధృతికి కరకట్టకు గతంలో గండ్లు పడిన ప్రాంతాలను  ఇరిగేషన్, పంచాయితీ, రెవెన్యూ,పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా బలోపేతం చేయాలని, గండ్లు పడిన వెంటనే పూడ్చేందుకు అవసరమైన ఇసుక సంచులు ఇతర సామగ్రి కూలీలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కృష్ణానదిలో వరద నీటి ఉధృతి కొనసాగుతున్నందున చేపలు పట్టేవారిని, ఈతకు వెళ్ళేవారిని, పశువులను మేపే వారిని నది వైపుకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు, లోతట్టు గ్రామాల వారికి  పంపిణీ కోసం అవసరం మేరకు నిత్యావసర సరుకులు సిద్దం చేయాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలలోని పంట పొలాల సశ్యరక్షణ చర్యలకు వ్యవసాయం అధికారులు ప్రణాళికలు ముందుగానే రూపొందించాలన్నారు. 

గ్రామాల్లో వరద నీటి వలన పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడకుండా పంచాయితీ అధికారులు ముందస్తుగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలన్నారు. లోతట్టు, ముంపు గ్రామాలలో వరద నీరు చేరితే వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అవసరమైన పడవలను మత్య్స శాఖ అధికారులు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ముంపు, లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను, సమీపంలోని పీహెచ్సీలలో అత్యవసర వైద్యసేవలను అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. నాగర్జునసాగర్ నుంచి, పులిచింతల ప్రాజెక్టు నుంచి, ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రవహిస్తున్న వరదనీటి వివరాలను, కృష్ణానది పై ప్రకటిస్తున్న ప్రమాద హెచ్చరికలను ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రియల్టైంలో జిల్లా అధికారులకు అందించాలన్నారు. వరదనీటి ప్రవాహం పై జిల్లా కేంద్రం నుంచి అందుతున్న సూచనలను గ్రామ స్థాయిలోని ప్రజలకు నిరంతరం చేరేవేసేందుకు సచివాలయ, రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు, వాలంటీర్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విపత్కర పరిస్థితులలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో కృష్ణానది వరద నీటి ఉధృతి వలన ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్ స్థాయిలోని అధికారులు మండల, గ్రామ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు ప్రణాళికలు పక్కాగా రూపొందించి అమలు చేయాలన్నారు.

సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరదనీటి ఉధృతిని పర్యవేక్షించే ముంపు, లోతట్టు మండలాల అధికారులకు నిరంతరం  సమాచారం అందించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లోను, గుంటూరు, గురజాల, తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోను ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటి వలన తొలుత మునిగిపోయే గ్రామాలను ముందస్తుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ముంపు గ్రామాలకు అవసరమైన నిత్యావసర సరుకులను సమీపంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచిచటం జరిగిందన్నారు.

సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి మాట్లాడుతూ కృష్ణానది ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ముంపు గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది కృష్ణానదిలో  వరదనీటి ఉధృతి తగ్గేవరకు సచివాలయ ఉద్యోగులు 24 గంటలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. నీరు ప్రవహించే లో లెవల్ కల్వర్టుల వద్ద ప్రజలు రాకపోకలు లేకుండా పోలీస్, పంచాయితీ ఇంజనీరింగ్ అధికారులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలకు అనుగుణంగా అవసరమైన మందులను వెద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉంచుకొన్నారన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, నాగర్జున సాగర్ కెనాల్ ఎస్ఈ గంగరాజు, పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు, కృష్ణారివర్ కన్జర్వేటర్ ఈఈ స్వరూప్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయితీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు