సమన్వయంతో పనులు పూర్తిచేయాలి..


Ens Balu
4
Srikakulam
2021-08-01 12:56:33

సర్పంచులు, నాయకులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్ లను పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కెశ్రీనివాసులు వెనుకబడిన 10 మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లును ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్.బి.కె, పంచాయతీ భవనాలు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై సమీకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  జె.సి మాట్లాడుతూ జిల్లాలో  చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలో సోంపేట, ఆమదాలవలస, వీరఘట్టం, నందిగాం, జలుమూరు,మెలియాపుట్టి,కవిటి,కంచిలి,ఇచ్చాపురం మరియు పొందూరు మండలాలు పురోగతిలో చివరి స్థానంలో ఉన్నాయన్నారు. ఈ పది మండలాలు కేవలం 29.82 శాతం మాత్రమే నిధులు ఖర్చుచేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.నిర్మాణాలలో స్థానికంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించి త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు. రానున్న వారం రోజుల్లో ఆయా మండలాల్లోని పనులు పూర్తిచేసి మొదటి స్థానంలోకి రావాలని కోరారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని కోరారు.

 అలాగే ప్రభుత్వం తరపున తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జె.సి.హామీ ఇచ్చారు.  నిర్మాణ స్థలాలన్ని జియో ట్యాగింగ్ అయినందున ప్రభుత్వం నిర్ణయించిన స్థలంలో నిర్మాణాలు పూర్తిచేయా ల్సిందేనని, ఇందులో ఎటువంటి ఒత్తిడిలకు గురికావద్దని జె.సి తెలిపారు. అలాగే నిర్మాణాలలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు,ఏజన్సీలకు బిల్లులు చెల్లింపులు జరగలేదని కొన్నిచోట్ల నిర్మాణాలు నిలిపివేయడం జరిగిందని, వారి బిల్లులు ఆన్ లైన్ నందు నమోదు చేయకపోవడంతో బిల్లులు చెల్లింపులు జరగలేదని జె.సి తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీ లను  చైతన్యపరచి ఇంతవరకు ఖర్చు చేసిన నిధులకు చెందిన బిల్లులను తక్షణమే ఆన్ లైన్ నందు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని జె.సి తేల్చిచెప్పారు. అలాగే ఏ రోజు జరిగిన పనులు ఆరోజే ఆన్ లైన్ నందు నమోదు చేయాలని  చెప్పారు. అధికారులు ప్రతి రోజు దిన చర్యగా ఆన్ లైన్ నందు స్థానాన్ని పరిశీలించు కొని, మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకొని చేపట్టాల్సిన పనులు గురించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రథమ స్థానానికి రావాలని జె.సి ఆకాక్షించారు. ఈ సమావేశంలో   పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ గుర్రం బ్రహ్మయ్య, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా నీటియాజ మాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్,మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు