కలెక్టరేట్ విభాగాలు తనిఖీ చేసిన కలెక్టర్..
Ens Balu
2
Kakinada
2021-08-01 13:48:27
మానవ వనరుల సమర్థ వినియోగం, విధుల నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలనతో పనిచేసేచోట మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. శనివారం జిల్లాకు కొత్తగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరికిరణ్ ఆదివారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తదితరులతో కలిసి కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. ఏ-హెచ్ సెక్షన్లను సందర్శించి, ఆయా సెక్షన్ల పనితీరును తనిఖీ చేశారు. అదే విధంగా రికార్డు గదులను పరిశీలించి వాటి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. పెస్ట్ కంట్రోల్ చర్యలతో పాటు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు, ఈ-గవర్నెన్స్, ఎన్ఐసీ, డ్వామా, ప్రణాళిక, వికాస, స్పందన తదితర విభాగాలను పరిశీలించారు. కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది ఖాళీలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నైపుణ్య శిక్షణకు సమాంతరంగా యువతకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని వికాస అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌కు వచ్చే వివిధ రకాల దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.