ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలను తక్షణం పరిష్కరించాలని.. సంతృప్తికర, నాణ్యతతో కూడిన సేవలు అందేలా చూడాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సుదీర్ఘ విరామం తర్వాత స్పందన కార్యక్రమం గత సోమవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. రెండో వారం కార్యక్రమం కొత్తగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరికిరణ్ నేతృత్వంలో సోమవారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు రావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. కలెక్టర్‌తో పాటు జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, జేసీ (గృహనిర్మాణం) ఎ.భార్గవ్‌తేజ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 9.30 గం. నుంచి 10 గం. వరకు అంతకుముందు వారం స్పందనకు వచ్చిన అర్జీల పరిష్కారం ప్రగతిపై సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించని అర్జీలపై ఆయా శాఖల అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్పందన వేదిక ద్వారా వచ్చే అర్జీలు, పరిష్కారం అంశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చి మనపై ఎంతో నమ్మకంతో అర్జీలు సమర్పిస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పారదర్శకత, జవాబుదారీతనంతో ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని, ఈ విషయంపై నిరంతరం పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. డిప్యుటేషన్ అనేది మానవతా దృక్పథంతో ఉండాలే తప్ప వెసులుబాటుగా ఉండకూడదన్నారు. డివిజనల్, మండల స్థాయిలో అధికారులు సచివాలయాల పనితీరును నిరంతరం పరిశీలించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఫలాలు అందేలా చూడాలన్నారు. తనిఖీల ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. కింది స్థాయిలో సరిగా తనిఖీలు చేపట్టకుంటే ఆ ప్రభావం ఉన్నతస్థాయిలో పడుతుందన్నారు. కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహణ సందర్భంగా పటిష్ట జాగ్రత్తలు తీసుకున్నారని, ఇదే విధంగా ఇతర కార్యాలయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిచెందకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.