కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి కోరారు. మూడోదశ రాకూడనే కోరుకుంటున్నామని, ఒకవేళ వస్తే, దానిని ఎదుర్కొనేందుకు గాను, ఆసుపత్రుల్లో అన్ని మౌలిక వసతులను సమకూర్చుకోవాలని సూచించారు. కోవిడ్ మూడోదశ సన్నద్దతపై వైద్యారోగ్యశాఖ అధికారులు, వైద్యులు, ప్రయివేటు ఆసుపత్రుల ప్రతినిధులు, ఆసుపత్రుల ఇన్‌ఛార్జి అధికారులతో, మూడోవిడత సమావేశం కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ, అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లోని పడకలకూ ఆక్సీజన్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. పడకల సంఖ్యలో కనీసం 70శాతం ఆక్సీజన్ కాన్‌సెంటేటర్లను సమకూర్చి సిద్దంగా ఉంచాలని సూచించారు. కొన్ని ఆసుపత్రులకు ఆక్సీజన్ ప్లాంట్లను, ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవాలని, వెంటిలేటర్ పడకలను సిద్దం చేయాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంటకటరావు మాట్లాడుతూ, ఆసుపత్రులవారీగా సన్నద్దతపై సమీక్షించారు. పడకల సంఖ్య, ఆక్సీజన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సీజన్ సిలండర్లు, కాన్‌సెంటేటర్లు, ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై, ఆయా ఆసుపత్రుల ప్రతినిధులను ప్రశ్నించారు. కోవిడ్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అన్నిటినీ పూర్తి చేసి, ఆసుప్రతులను ఆగస్టు 15లోగా అన్నివిధాలా సిద్దం చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కొన్ని దేశాల్లో ఇప్పటికే కోవిడ్ మూడోదశ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అందువల్ల ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా, జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులను సంసిద్దం చేయాలని సూచించారు. ఏ వ్యక్తి కూడా కోవిడ్ చికత్స కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని, అన్ని వనరులను సిద్దం చేయాలని చెప్పారు. మూడోదశలో కోవిడ్ పిల్లలకు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, పిల్లలకు చికిత్సను అందించేందుకు అనువైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఎపిఎంఐడిసి ఇఇ సత్యప్రభాకర్, వివిధ ఆసుపత్రుల నాన్‌మెడికల్ ఆఫీసర్లు, ఆసుపత్రుల ప్రతినిధులు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.