విద్యాప్రమాణాలు పెంచేందుకే నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, జాతీయ విద్యావిధానం-2020 పై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యావ్యవస్థపై సుదీర్ఘ అధ్యయనం తరువాతే ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రవేశపెడుతోందని అన్నారు. పిల్లల వయసు, వారి అభ్యసన సామర్థ్యం, తోటిపిల్లలతో మెలిగే తీరు తదిర పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త విధానాన్ని ఖరారు చేశారని అన్నారు. ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించలేదని, కేవలం సూచన మాత్రమే చేసిందని చెప్పారు. కేంద్రం సూచించిన నూతన విద్యావిధానాన్ని బాగా అధ్యయనం చేసి, కొన్ని మార్పులతో రాష్ట్రం కొత్త విద్యావిధానాన్ని ఖరారు చేసిందన్నారు. కేవలం విద్య మాత్రమే కాకుండా, సంస్కృతి, కళలు, క్రీడలు తదితర అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని నూతన విద్యావిధానాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కొత్త విధానంలో ఏ ఒక్కరినీ తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లా భౌగోలిక పరిస్థితులూ, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మార్పులు చేర్పులు చేసుకొనే అవకాశం ఉందని, అందువల్ల విలువైన సలహాలు, సూచనలూ అందజేయాలని జెసి కోరారు. ఈ సదస్సులో జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, ఉప విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ, ఇతర అధికారులు, వివిధ పాఠశాలల హెడ్‌మాష్టర్లు పాల్గొన్నారు.