శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 5న 72వ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ గుప్త పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆగష్టు 5వ తేదీ ఉదయం 9.00గం.లకు స్థానిక పురుషుల పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. వీరితో పాటు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటి ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో నిండేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరం పది మొక్కలు ప్రతిన బూని నాటుదాం అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.