శ్రీవాణి ట్రస్ట్ కు ఇంజినీరింగ్ విభాగం..
Ens Balu
2
Tirupati
2021-08-03 14:20:40
శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ముందే ఆలయం స్థల పురాణం, ప్రాశస్త్యం, ఇప్పటిదాకా పూజలు జరుగుతున్నాయా అనే అంశాలు పరిశీలించాలని చెప్పారు. ట్రస్ట్ నిధులతో ఆలయం పునరుద్ధరణ, లేదా అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల భక్తులకు ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాలని ఈవో చెప్పారు. ప్రతిపాదన నుంచి పని పూర్తి చేసే వరకు వ్యవధి నిర్ణయించుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టేలా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆలయాల్లో నీటి సరఫరా,ఇతర మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం పనులు కూడా చేపట్టాలన్నారు. పురాతన ఆలయాల మరమ్మతుల సమయంలో నిర్మాణం డిజైన్ దెబ్బ తినకుండా చూడాలని చెప్పారు. తిరుమలలో రోడ్లు, ఫుట్ పాత్ నిర్వహణ చక్కగా ఉండాలని, సంబంధిత అధికారులు వారానికోసారి స్వయంగా వీటిని చూడాలని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి పలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేశారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్ ఈ సమీక్ష లో పాల్గొన్నారు.