కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని.. మన జిల్లాలోనూ కొన్ని మండలాల్లో పాజిటివిటీ పెరుగుతున్నందున అప్రమత్తతతో వ్యవహరించాలని.. మండల, డివిజన్ స్థాయిలో వారానికి కనీసం రెండుసార్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్ నుంచి వర్చువల్ విధానంలో జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (ఏ అండ్ డబ్ల్యూ) జి.రాజకుమారి, జేసీ (హెచ్) ఎ.భార్గవ్‌తేజ, జిల్లాస్థాయి అధికారులతో కలిసి మండల, డివిజనల్ అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు; రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో వ్యవహరించి కోవిడ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ సహకారంతో జరిమానా విధింపులు జరిగేలా చూడాలన్నారు. 50, ఆపై పడకలున్న కోవిడ్ ఆసుపత్రులకు అనుబంధంగా ట్రాన్సిట్ ఆసుపత్రుల ఏర్పాటుపై దృష్టిసారించాలని సూచించారు. ఆగస్టు 10 తర్వాత ముహూర్తాలు ఉన్నందున వివాహాలకు తహసీల్దారు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, 150 కంటే ఎక్కువ మంది వివాహ కార్యక్రమానికి హాజరుకాకుండా చూడాలన్నారు.
జిల్లాలో సమర్థవంతమైన అధికార బృందం ఉందని.. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు పురోగతిలో ఇది ప్రస్ఫుటం కావాలన్నారు. ప్రజా ఫిర్యాదుల వేదిక స్పందన కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని.. బియ్యంకార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టాకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత ఎస్ఎల్ఏ గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సచివాలయాల సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని, ఈ అంశంపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు; ఆర్‌బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల శాశ్వత భవన నిర్మాణాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, జేడీ(ఏ) ఎన్.విజయ్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.