గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నమ్మకంతో సృష్టించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు.ఈ నేపథ్యంలో కాకినాడ గ్రామీణ మండలం నేమాం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ,సర్పంచ్ ల భాగస్వామ్యం,సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పట్టినందున తిరిగి సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సచివాలయ సిబ్బందికి సంబంధించి డిప్యుటేషన్ లు రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని , సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో మినహా తమకు కేటాయించిన సచివాలయంలోనే విధులు నిర్వహించాలన్నారు. నేమాం గ్రామానికి సంబంధించి సిబ్బంది గడువులోనే సేవలందిస్తున్నారని, త్వరలోనే నూతన భవన సముదాయాలు అందుబాటులోకి రానున్నాయాన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుకు సంబంధించి సచివాలయంలో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, జాబితాలోని వివరాలను, సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు , నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు నిర్మాణం , గ్రౌండింగ్ పరిస్థితి, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు మంజూరు,మత్స్యకార భరోసా తదితర అంశాలపై సిబ్బందిని కలెక్టర్ ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకుని,క్షుణ్ణంగా రిజిస్టర్ లను తనిఖీ చేశారు .
అనంతరం నేమాం గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ,బల్క్ మిల్క్ సెంటర్ భవనాలను కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, భవనాల నిర్మాణ పనుల పురోగతిని ఆయా విభాగాల ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి నేమాం లేఅవుట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా లేఅవుట్ లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహ సముదాయలను పరిశీలించి , ఇళ్ల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాలను కలెక్టర్ నేరుగా లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ.నారాయణ మూర్తి, హౌసింగ్ డీఈ గుప్త , పంచాయతీ రాజ్ డీఈ కె.శ్రీనివాసు,నేమాం సర్పంచ్ చిన్న ,ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.