విజయనగరం జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విభిన్నంగా నిర్వహించాలని, అందుకు పకడ్భందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన విధానాన్ని, వివిధ శాఖలు ప్రతీఏటా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, సంప్రదాయభద్దంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా సాధారణ ప్రజలను వేడుకలకు అనుతించబోమని, స్క్రీన్స్ ఏర్పాటు చేసి లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్రసారం చేస్తామని చెప్పారు. స్టాల్స్, శకటాలను ఈ ఏడాది రద్దు చేస్తూ, వాటికి బదులుగా, నవరత్నాలు, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రాధాన్యతలను వివరిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను, పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన పనులను సూచించి, ఈ నెల 12వ తేదీలోగా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఎఫ్ఓ సచిన్ గుప్తా, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.