ప్రతిష్టాత్మక నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలులో లోపాలను సవరించి, త్వరితగతిన లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా డివిజన్ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు జేసీ (గృహ నిర్మాణం) ఎ.భార్గవ్ తేజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలిదశ లేఅవుట్లలో లెవెలింగ్, మౌలిక వసతుల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ సామగ్రి తదితరాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం లక్ష్యంగా డివిజనల్ సమావేశాలను నిర్వహించనున్నట్లు భార్గవ్ తేజ తెలిపారు. ఆగస్టు 5న పెద్దాపురం డివిజన్‌లో సమావేశం నిర్వహించనున్నామని, ఏడో తేదీన రామచంద్రాపురం, ఎనిమిదో తేదీన రాజమహేంద్రవరం, తొమ్మిదిన కాకినాడ, 12వ తేదీన అమలాపురం డివిజన్లలో సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశాలకు ఆయా డివిజన్ల పరిధిలోని ప్రజాప్రతినిధులు హాజరై జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు సూచనలు, సలహాలు అందించాలని జేసీ (హెచ్) భార్గవ్ తేజ కోరారు.