మూడోదకు ముందస్తు ఏర్పాటు చేయాలి..


Ens Balu
1
Visakhapatnam
2021-08-04 14:58:01

విశాఖజిల్లాలో 3వ దశ కోవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేసారు.  కోవిడ్ రహిత జిల్లాగా విశాఖను తీర్చి దిద్దాలన్నారు.  బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయపు  సమావేశ మందిరంలో  కోవిడ్–19 మూడవ దశ నివారణకు  తీసుకోవలసిన  చర్యలపై జిల్లా  అధికారులు, శాసన సభ్యులతో  సమావేశం నిర్వహించి, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల  సూచనలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో  ఎదుర్కొన్న  సమస్యలు పునరావృతం  కాకుండా నిర్ధిష్టమైన భద్రత, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.   జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా  ఉత్సవాలు, సామూహికంగా వేడుకలు  నిర్వహించకూడదని పేర్కొన్నారు.  నిబంధనలు అతిక్రమించి, మాస్క్ లు వినియోగించని  వారిపై  తగిన  చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు.   కోవిడ్ భారిన పడి కోలుకున్న వారికి వచ్చే ఆరోగ్య సమస్యలకు తగిన  వైద్యం అందించాలన్నారు.  కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ లో  నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.  జిల్లాలో  ఎక్కడా మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ప్రజా ప్రతి నిధులకు  అధికారులు  సహకరించి వారి సూచనలు అమలు చేయాలన్నారు. 

జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ధర్డ్ వేవ్ రాకుండా కోరుకుంటున్నానని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ధర్డ్ వేవ్ పై  కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. పౌరులు మాస్క్ లేకుండా  షాపింగ్ లకు  వెళితే షాపు యజమానికి రూ.10వేల నుంచి  రూ. 25వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసారు.  కోవిడ్ నిబంధనలు  అతిక్రమించే షాపులు, షాపింగ్ మాల్స్ పై కఠినంగా  వ్యవహరిస్తామన్నారు.  పార్కులు  బహిరంగ ప్రదేశాలలో  నిబంధనలు పక్కాగా అమలు చేయాలని  పోలీస్ అధికారులకు  సూచించారు.  వి ఎం ఆర్ డి ఎ, జి వి ఎం సి, పోలీస్ అధికారులు  మాస్క్ లు ధరించని వారిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ ధర్డ్ వేవ్ నివారణకు జిల్లాలో   75 ఆసుపత్రులను  గుర్తించామన్నారు.  3370 బెడ్స్, 582 వెంటిలేటర్లు సిద్దం చేసామన్నారు.  చిన్న పిల్లల కోసం 100 పడకలు  ఏర్పాటు  చేసామన్నారు.  కె జి. హెచ్, విమ్స్, చెస్ట్ ఆసుపత్రిలో  బెడ్స్ సిద్దం చేసామని వివరించారు. 

పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీలో నిబంధనలు అమలు లేవని, వారపు సంతలకు  అనుమతిచ్చారని, గిరిజన ప్రాంతం లో కోవిడ్  నిబంధనలు అమలు చేయాలన్నారు.  పాయకరావుపేట ఎం .ఎల్ .ఎ . గొల్లబాబురావు మాట్లాడుతూ కె.జి.హెచ్ సి ఎస్ ఆర్ బ్లాకులో సౌకర్యాలు మెరుగు పరచాలని, పారిశద్ద్యపనులు చేయాలన్నారు.  అనకాపల్లి శాసన సభ్యులు  గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ చోడవరం, మాడుగుల ప్రజలు  అనకాపల్లి ఆసుపత్రి పై ఆధారపడతారని  అనకాపల్లి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో  వైద్యులను సిబ్బందిని నియమించాలన్నారు.  
పెందుర్తి ఎం ఎల్ ఎ  అదీప్ రాజు పెందుర్తి అర్బన్ లో లక్షమంది, గ్రామీణ ప్రాంతంలో  30 వేల మంది జనాభా  ఉన్నారని ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.  నెడ్ క్యాప్ చైర్మన్   కె. కె. రాజు,  ఎం ఎల్ ఎ గణబాబు కోవిడ్ అనంతరం వచ్చే సమస్యలపై దృష్టి  సారించాలన్నారు. చోడవరం ఎం .ఎల్ ఎ దర్మశ్రీ  నోడల్ అధికారులను కొనసాగించాలని సూచించారు. సాయంత్రం 5గంటల తరువాత బీచ్ రోడ్ లో సందర్శకులను అనుమతించ కుండా  చర్యలు  తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  మాట్లాడుతూ పీవర్ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో  మాడుగుల ఎం ఎల్ ఎ ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,  జి.వి.ఎం.సి సృజన,  ఎస్ పి  బి. కృష్ణారావు , వి ఎం ఆర్ డి ఎ చైర్ పర్సన్ విజయనిర్మల,  మళ్ల విజయ ప్రసాద్, ఎ ఎం సి ప్రిన్సిపాల్ డా. సుధాకర్,  డి ఎం అండ్ హెచ్ ఒ  డా. సూర్యనారాయణ ,  కె జి హెచ్ సూపరిండెంట్ డా.మైధిలి తదితరులు పాల్గొన్నారు.