గొప్ప వాగ్గేయకారుడు దివంగత వంగపండు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-08-04 15:34:27

గొప్ప వాగ్గేయకారుడు, ప్రజా కవి (వంగపండు ప్రసాదరావు) అని, పేద ప్రజల కోసం ఎన్నో పద్యాలు, పాటలు వ్రాసి పాడారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.   బుధవారం  వి.ఎం.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో   ప్రముఖ  వాగ్గేయకారుడు,  ప్రజా కవి వంగపండు ప్రసాదరావు  ప్రధమ వర్ధంతి  సందర్భంగా   ప్రభుత్వ పరంగా  కార్యక్రమాన్ని  నిర్వహించడం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి  అధ్యక్షత  వహించిన మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  వంగపండు ప్రసాదరావు  బడుగుల జీవితాలు, వారి కష్టాలు, ఇబ్బందులను  వారి పాటలు పధ్యాలు ద్వారా  వెలుగులోకి  తీసుకు రావడానికి  కృషి చేసారన్నారు. వారిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి పేరిట  జానపద పురస్కారాన్ని  ఒక జానపద కళాకారుడికి ప్రదానం గావించాలని నిర్ణయించిందని  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం   చైర్మన్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు వర్థంతి సభను  శోభాయమానంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేసారు. ప్రముఖ జానపద గాయకుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, విప్లవ  కవిని గుర్తించి  ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినందుకు  కృతజ్ఞతలు తెలుపుతూ  ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసారు.  విమలక్క మాట్లాడుతూ  ప్రజా కవి వంగపండు జీవితాన్ని  కొనియాడారు .  వంగపండు ప్రసాదరావు  “నా మాట- నాపాట” ప్రజలకు అంకితం  అనే వారని గుర్తుచేశారు.

 ప్రముఖ జానపద గాయకుడు  గద్దర్ మాట్లాడుతూ  ఈ రోజును  “త్యాగాల పాటల ప్రజల దినం” గా  అభివర్ణించారు.  నేను పాడిన పాటలన్నీ  వంగపండు వ్రాసినవే అన్నారు.   మానవ సమాజం గురించిన తత్వాన్ని  వివరించారు.  మనది “వైవిద్య” భారత  దేశమని, వంగపండు  “సజీవం” గానే  ఉంటారని  తెలిపారు.  వంగపండు పాటలను హిందిలోకి  అనువదించాలని  గద్దర్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ ను  కోరారు.
ఈ సందర్భంగా గద్దర్, ఆర్.నారాయణ మూర్తి, విమలక్క పలు జానపద గేయాలను లయ బద్దంగా  పాడి ఉర్రూతలూగించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు  మల్లిఖార్జున, ఎం.ఎల్. ఏ. లు  కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, భాగ్యలక్ష్మీ,  వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్  అక్కరమాని విజయనిర్మల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్చన్ వంగపండు ఉషా తదితరులు ప్రసంగించారు.  అనంతరం వంగపండు ప్రసాదరావు జానపద పురస్కారం ప్రముఖ జానపద కళాకారులు “శ్రీ బాడ సూరయ్య” కు అందించి వారిని  మంత్రి  ఘనంగా  సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పలువురు  అధికారులు  పాల్గొన్నారు.