ఆరోగ్యభారత్ మనందరి లక్ష్యం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-08-05 15:45:02

ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతీ  ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి కర్తవ్య దీక్షతో సాగాలని, అట్లాంటి నిబద్ధతతో పనిచేస్తే భారత ప్రభుత్వం నరేంద్రమోదీ కలలు కన్న ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యపడతుందని శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.ప్రభాకరరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నెహ్రు యువ కేంద్రం మరియు శ్రీకాకుళం జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతే పక్వాడా పక్షోత్సవాలు, మాస్కే రక్షణ కవచం ర్యాలీను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ప్రధాన ఘట్టం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ అని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సగం రోగాలు నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కరోనా మూడవ దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కరోనా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ,vకరోనా  కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 శ్రీకాకుళం జిల్లాలో పల్లెల్లో స్వచ్చ భారత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మూడో దశ వ్యాప్తి అరికట్టడానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మాస్కు ప్రాధాన్యత ను తెలియజేస్తూ క్రీడాకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల మీదుగా  మాస్కె రక్షణ కవచం  ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ప్రధాన కోచ్ బి.శ్రీనివాస్ కుమార్, నెహ్రు యువక కేంద్రం ప్రతినిధి డి.శ్రీనివాసరావు, పర్యాటక  అధికారి ఎన్. నారాయణ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూన వెంకట రమణ మూర్తి, ఎస్.జోగినాయుడు, ఐ. కె.రావు, వివిధ క్రీడా విభాగాల కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.