డిపార్ట్ మెంటల్ టెస్టులకి ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
2
Srikakulam
2021-08-05 15:48:25

శ్రీకాకుళం జిల్లాలో ఆగస్టు 6నుండి జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ఆగష్ట్ 6 నుండి 13వ తేదీ వరకు ఏ.పి.పి.యస్.సి నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్టులపై చీఫ్ సూపరింటెండెంట్లతో డి.ఆర్.ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులను పొందుటకు అవసరమైన శాఖపర పరీక్షలు ఇవని అన్నారు. ఈ పరీక్షలకు సుమారు 1150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యే అవకాశముందని, కావున  వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఎచ్చెర్లలోని   శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, రాజాంలోని జి.ఎం.ఆర్. కళాశాల , టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు ఒక షెషన్, మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు  మరో షెషన్ చొప్పున మొత్తం 15 షెషన్స్ లలో పరీక్షలు జరగుతాయని డి.ఆర్.ఓ.ఓ స్పష్టం చేసారు. కోవిడ్ నేపధ్యంలో పరీక్షలకు హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకునేలా తగు చర్యలు ఆయా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు పరీక్షా సమాయానికి గంట ముందే హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. సకాలంలో అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యేవిధంగా ఆర్.టి.సి, వైద్య సదుపాయాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను డి.ఆర్.ఓ ఆదేశించారు. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

          ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసిస్టెంట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.రాజు, సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.ప్రసాదరావు, శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర, జి.ఎం.ఆర్, ఆదిత్య కళాశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.