స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ద్వారా శ్రీకాకుళం స్వచ్ఛతకు మారుపేరు కావాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. ఏ.పి.హెచ్.బి.కాలనీలో గల కార్గిల్ పార్క్ వద్ద పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడంతోనే పని అయిపోలేదని, దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు. నేడు ఎవరి ఇంటి ముందు మొక్కలు నాటారో, ఆ ఇంటి యజమానులే వాటి సంరక్షణ బాద్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలనీలోని ప్రతీ ఇంటికీ వాలంటీర్ ద్వారా తడి చెత్త, పొడిచెత్త, కాలుష్య చెత్త వేరు వేరుగా వేయుటకు 3 ప్లాస్టిక్ డస్ట్ బిన్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్... క్లీన్ శ్రీకాకుళం కార్యక్రమం మొట్ట మొదటిగా కార్గిల్ పార్క్ వద్ద ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ కాలనీలో విశ్రాంతి ఉద్యోగులు, కాలనీ అసోసియేషన్, మంచి రోడ్లు, పార్కులు మంచి నాయకత్వం కలిగిన వారు ఉన్నారని, ఆదర్శకాలనీగా ఈ కాలనీ ఉంటుందని ప్రగాఢంగా నమ్మి పైలట్ ప్రోజెక్టుగా ఎంచుకున్నామన్నారు.
. గతంలో చెత్త వేయడానికి ఎక్కడా స్థలం లేని పరిస్థితుల్లో సింగుపురం వద్ద సుమారు 25 ఎకరాలలో డంపింగ్ యార్డ్ కొరకు తీసుకోవడం జరిగిందని, ఇపుడు అక్కడ కూడా చెత్త వేయడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందువలన పాత పద్ధతిని విడనాడి కొత్త పద్దతిని అనుసరించాలని, అందులో భాగంగా ఈ డస్ట్ బిన్ల పద్దతిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై మొదటగా వార్డు వాలంటీర్ అవగాహన కల్పించుకుని అనంతరం వారి పరిధిలో గల గృహాల మహిళకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతీ రోజూ ఇంటి ముందరికి వచ్చే చెత్త కలెక్షన్ చేసేవారికి అవమానకర పద్దతిలో చూడరాదని, అటువంటి వారు లేకపోతే మనం రోగాల పాలు కాక తప్పదని హెచ్చరించారు. అందువలన వాళ్ళని గౌరవించాలని, తద్వారా చెత్త రహిత శ్రీకాకుళంగా తీర్చిదిద్దు కుందాం అని అన్నారు. మరలా త్వరలో ఈ కాలనీకి వస్తానని, ఇపుడు నాటిన మొక్కలు, చెత్తపై పరిశీలన చేస్తానని తెలిపారు. పందులు, కుక్కలు, ఆవులు గురించి కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ ఫిర్యాదుపై కమీషనర్ స్పందించి పందులను వాటి యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. అప్పటికి వారినుండి స్పందన రాకపోతే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కలకు సంబంధించి కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆవులు రోడ్లపై తిరిగితే తొలిసారికి రూ.2500/-లు, రెండవసారి రూ.5000/-లు జరిమానాగా నిర్ణయించడం జరిగిందని, ఇకపై ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కావని హామీ ఇచ్చారు.
నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పొజెక్టులలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ఒకటని అన్నారు. అందులో భాగంగా స్వచ్ఛతకు మారుపేరుగా శ్రీకాకుళంను తీర్చిదిద్దేందుకు విశేష కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్లీన్ శ్రీకాకుళంలో భాగంగా ప్రతీ ఇంటికి 3 రకాల ప్లాస్టిక్ డస్ట్ బిన్లు అందజేయడం జరిగిందని, డస్ట్ బిన్లను ఉపయోగించుకునే విధానం గురించి ఆయన మహిళలకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లలో పాత పద్దతిలో చెత్త కలెక్షన్ మార్పు కోసం కొత్త పద్దతిని అనుసరించే విధానంలో భాగమే ఈ డస్ట్ బిన్ ల పంపిణి అని అన్నారు.