అరసవల్లి వద్ద కాజీపేటలో రూ.25 లక్షల నిధులతో కుక్కల కుటుంబ నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్ ) శాలను స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గురువారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ కమీషనర్ కుక్కల జనన నియంత్రణ గురించి శాసన సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాల మేరకు వీధి కుక్కల సంతతి నియంత్రణ చర్యలలో భాగంగా కుటుంబ నియంత్రణ శాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం లో సుమారు 4 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు కమీషనర్ తెలిపారని, ఇవి వాహనదారుల వెంటబడి కరవడం చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ చట్టం ప్రకారం ప్రతీ జీవికి జీవించే హక్కు ఉందని, అందువలన వాటిని చంపకూడదని స్పష్టం చేశారు. అయితే వీటికి కుటుంబ నియంత్రణ చేసి, తద్వారా వాటి సంతతిని నిర్మూలించ వచ్చని, అందువలనే దీన్ని ప్రారంభించుకోవడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. అందుకోసం ఈ విభాగాన్ని ఇక్కడ అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. మొదటగా వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి 4 రోజులు పర్యవేక్షణలో ఉంచి తదుపరి ఎక్కడ పట్టుకున్న కుక్కలను అదే వీధిలో నగరపాలక సంస్థ సిబ్బంది వదిలేస్తారని అన్నారు. కుటుంబ నియంత్రణతో పాటు కుక్కలు నుండి ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉండేందుకు
రబిపూర్ ఇంజక్షన్లను కూడా కుక్కలకి వేయడం జరుగుతుందని చెప్పారు. కుక్కలు కోపంగా ఉండి కరవడానికి వెంటబడే తత్వం కలిగి ఉంటాయని, వాటికి ఆ కోపాన్ని తగ్గించే ఇంజెక్షన్లను కూడా వేయనున్నట్లు కమీషనర్ చెప్పారని అన్నారు. కాజీ పేటలో సుమారు 50 కుక్కలకు ఉంచడానికి గదులు నిర్మాణం చేయడం జరిగిందని,అలాగే శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలుగా 10 బల్లలను అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కుక్కల కుటుంబ నియంత్రణ, ఇంజెక్షన్లు, కార్యక్రమం మొత్తం స్థానిక వెటర్నరీ డాక్టర్ సూర్యం బ్లూ క్రాస్ సంస్థ చైర్మన్ వారితో ఎం.ఓ.యూ కూడా చేసుకోబో తున్నట్లు కమీషనర్ తెలిపారని, ఇది శుభదాయకమన్నారు. బ్లూ క్రాస్ చైర్మన్ సూర్యం మాట్లాడుతూ గతంలో రాష్ట్రం మొత్తం 42 వేలకు పైగా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసిన అనుభవం తమ సిబ్బందికి ఉందని అన్నారు. కుక్కలవల్ల ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కరోనా లాంటి వ్యాధి నుండి తప్పించుకోవచ్చు కానీ రాబిస్ వ్యాధి వచ్చిందంటే మరణమే అని అన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. తమవద్ద డాగ్ క్యాచర్లు ఉన్నారని, వీరితో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందనే నమ్మకం తమకు ఉందని అన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డా. వెంకటరావు మాట్లాడుతూ ప్రతీరోజు కుక్కలు గురించి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే వీటిపై దృష్టి పెట్టామని అన్నారు. .ఇకముందు ఇటువంటి ఫిర్యాదులు లేకుండా ఈ కుక్కల కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. దక్షిణ మూర్తి,ఉప కార్య నిర్వాహక ఇంజినీర్ రమణమూర్తి , పారిశుద్ధ్యం పర్యవేక్షకులు గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.