మట్టికొట్టుకు పోతావు ఆడదాని ఉసురుపోసుకుంటే..
Ens Balu
4
Visakhapatnam
2021-08-05 17:18:25
ఒక ఆడబిడ్డను ఏడిపించి వేధింపులకు గురిచేస్తే మట్టికొట్టుకుపోతావంటూ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై నిజంగానే మట్టిని విసిరికొట్టారు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఈ సంఘటన గురువారం విశాఖలోని డిసి కార్యాలయంలో జరిగింది. తనను పదే పదే ఏడిపించడం, వివిధ కారణాలతో తన కింది స్థాయి సిబ్బందితో లాలూచీ పడుతున్నట్టు చిత్రీకరిస్తూ వివిధ మీడియాల్లో వార్తలు రాయిస్తున్నారని, పైగా తనను వేధిస్తున్నారని ఏసి మీడియా ముందు బోరున విలపించారు అసిస్టెంట్ కమిషనర్. మహిళనైన తనపై వేధింపులు తట్టుకోలేకే ఈరోజు డిసిపై నిజంగానే మట్టిని విసిరి కొట్టానని కన్నీటి పర్యంతమై చెప్పారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి తప్పితే వాటిని తనకు ఎలా ఆపాదిస్తారని ఆరోపించారు. వేరొక ప్రాంతం నుంచి కుటుంబాన్ని వదలి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని, అయినా తనపై పదే పదే వేధింపులకు డిప్యూటీ కమిషనర్ దిగుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తమ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు ఆమె ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈయన చేస్తున్న వేధింపులపై గతంలోనే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ సమయంలో కూడా ఆయన హాజరు కాలేదన్నారు. అయితే జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా డిసి చెప్పడం విశేషం. తన వ్రుత్తి ధర్మంగానే తాను వ్యవహరించానని ఆయన కూడా మీడియాకి వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత కారణాలు, ఆలోచనలు లేవని చెప్పుకొచ్చారు. దేవాదాయశాఖ డిసిపై మహిళా ఏసి మట్టి విసిరి కొట్టం చర్చనీయాంశమవుతోంది. అయితే గతంలో ఓ దేవస్థానంలో సుమారు రూ.7లక్షల దేవుని హుండీ ఆదాయం కాజేశారనే ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిపై ఉన్నాయి. ఆ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతున్న సమయంలో కాన్ఫిడెన్సియల్ ఇన్ఫర్ మేషన్ మీడియాకి లీక్ చేశారనే ఆరోపణలు కూడా డీసి పై ఉన్నాయి. సాధారణంగా కాన్ఫిడెన్సియల్ సమాచారాన్ని ఏ ప్రభుత్వ అధికారి మీడియాకి వివరించ కూడదు. ఈ విషయంలో డిసిని ఉన్నతాధికారులు మందలించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి వుంది..