వైఎస్సార్ జగనన్న కాలనీలు వేగంపెంచాలి..


Ens Balu
3
Guntur
2021-08-05 17:24:09

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ జగనన్న కాలనీలలో గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేసి ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు.  గురువారం స్థానిక కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గుంటూరు డివిజన్ లోని ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాలలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ రోజు వారి కూలీలకు వెళ్ళే భార్య భర్తలు సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవడం కష్టంతో కూడుకున్న విషయమని, వీరికి ఆప్షన్ మూడు ద్వారా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా లే అవుట్లలో రెండు రోజుల్లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతి లే అవుట్ లో సాండ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ప్లాస్టిక్ పట్టాలతో భూమిలో సంపులను నిర్మించాలన్నారు. లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాల  పర్యవేక్షణకు వీలుగా తాత్కాలికంగా అధికారులు ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన కంకర సరఫరా కోసం క్వారీ యజమానులతో సమావేశం నిర్వహించి, తక్కువ ధరకు కంకర సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో వైఎస్సార్ జగనన్న లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. 

  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో జగనన్న కాలనీలలో 1.22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు  మంజూరు చేసారన్నారు.  ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఇళ్ళు నిర్మించుకునే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా  మెప్మా, బ్యాంకర్ల తో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెగా గ్రౌన్దింగ్ మేళా లో 91,343 గృహాలకు శంఖుస్థాపన చేసామని, లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్ చేసి, జియో ట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ చేస్తున్నామన్నారు.  అన్ని లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా విద్యుత్, నీరు, ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

  గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు  మాట్లాడుతూ  జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నదని, ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్, స్టేజ్  వైజ్ నిధులు సకాలంలో అందేలా అధికారులు సహకరించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో అవసరమైన అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ తరపున అమలు జరుగుతున్న పధకాల ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

  సమావేశంలో సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణు గోపాల రావు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల  హౌసింగ్, రెవిన్యూ, పంచాయితీ, విద్యుత్, ఇంజనీరింగ్, నగరపాలక సంస్థ  అధికారులు పాల్గొన్నారు.  

సిఫార్సు