జాతీయ రహదారి పనులు వేగం పెంచాలి..
Ens Balu
1
Vizianagaram
2021-08-06 13:52:09
రాయిపూర్ –విశాఖపట్నం 6 లైన్ల జాతీయ రహదారి కి సంబంధించి 559.50 హెక్టార్లలో జరగాల్సిన పనులను వేగంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు త్వరగా పూర్తి ఆయితే పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, అందువలన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. శుక్రవారం జాతీయ రహదారుల పనుల పై భూ సేకరణ అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. జాతీయ రహదారుల డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్ మిశ్ర పనుల పురోగతిపై కలెక్టర్ కు వివరించారు. రాయిపూర్ నుండి విశాఖపట్నం జాతీయ రహదారి సివిల్ పనుల పురోగతి పాకేజ్ 1 నుండి 4 వరకు ఏ ఏ స్థాయిలలో ఉన్నాయో సమీక్షించారు. గ్రామాలలో అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల, ఇతర ఆస్తుల లెక్కింపు త్వరిత గతిన పూర్తి చేసి పరిహారం చెల్లింపులు త్వరితగతిన జరగాలని సూచించారు. అటవీ క్లియరెన్స్ కు సంబంధించి అటవీ శాఖ అధికారులు స్వయంగా వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. భూ సేకరణ కు సంబంధించి తహసిల్దార్ల సమక్షం లో తప్పకుండా గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ డా. జి.సి .కిషోర్ కుమార్ మాట్లాడుతూ రాయిపూర్ – విశాఖ రహదారి కి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇప్పటికే పొందడం జరిగిందని అటవీ క్లియరెన్స్ పాకేజ్ 1,2 కు సంబంధించి 6.40 కిలో మీటర్లలో 29.18 హెక్టార్ల భూమి కి సంబంచించి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పాకేజ్ 1 నుండి 4 వరకు అవసరమగు అదనపు భూమి కోసం 3 డి పబ్లికేషన్ పూర్తి చేసామని తెలిపారు. పాకేజ్ 1,2,3 పనులు పురోగతి లో ఉన్నాయని, పాకేజ్ 4 లో కోర్ట్ కేసు లు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించి పనులు వేగంగా జరిగేల చూస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, ఉప కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉద్యాన, జలవనురుల, విద్యుత్, ఆర్.డబ్లు..ఎస్. శాఖల అధికారులు పాల్గొన్నారు.