ఎంపిడిఓలకు పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పంచాయితీరాజ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా దాదాపు 25 ఏళ్ల నుంచీ ఎటువంటి పదోన్నతి పొందకుండా ఒకే కేడరులో పనిచేస్తున్న సుమారు 255 మంది ఎంపిడిఓలకు, పంచాయితీరాజ్ శాఖ సిబ్బందికీ ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొన్నారు. స్థానికంగా శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపిడిఓల సంఘం జిల్లా నాయకులు కె.రాజ్‌కుమార్, కె.రామచంద్రరావు మాట్లాడుతూ, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 18,500 మంది పంచాయితీరాజ్ ఉద్యోగులకు కూడా, వారి హోదాను బట్టి పదోన్నతులు లభిస్తాయని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి, పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విలేకర్ల సమావేశంలో పిఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఏ.సురేష్, కార్యదర్శి సిహెచ్ మురళి, పరిషత్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు పిజె అమృత, పి.కిరణ్, పిఆర్ విస్తరణాధికారుల సంఘం నాయకులు సురేష్ పాల్గొన్నారు.