కోవిడ్ నిబంధనలతోనే పంద్రాగస్టు వేడుకలు..
Ens Balu
2
Vizianagaram
2021-08-06 13:53:58
కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లను జె.సి. శుక్రవారం రెవిన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. వేదికపైకి ప్రముఖులు మినహా ఇతరులు ఎవ్వరూ వెళ్లకుండా నిరోధించాల్సి వుందని ఆర్.డి.ఓ. భవానీశంకర్ కు సూచించారు. ప్రజాప్రతినిధులకోసం కేటాయించిన సీట్లను వారికే వదిలిపెట్టాలని, ఇతరులు వాటిని ఆక్రమించకుండా చూడాలన్నారు. ప్రముఖులకు ఎక్కడా అతిథి మర్యాదల్లో లోపం లేకుండా ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలన్నారు. అవార్డుల కోసం వేదికపైకి వచ్చేందుకు ఆయా శాఖల సిబ్బంది క్యూ వరుసల్లో నిల్చొనేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వేదిక ముందు గుంపులుగా ప్రభుత్వ సిబ్బంది గుమికూడకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. వేడుకలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో ఆర్.డి.ఓ. భవానీ శంకర్, తహశీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.