ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ఫలాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించ డంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితరాల శాశ్వత భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న శాశ్వత భవన నిర్మాణ పనుల్లో బాగా వెనుకబడిన నియోజకవర్గాల పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరికిరణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తపేట, మండపేట, రాజోలు, పి.గన్నవరం, తుని, ముమ్మిడివరం, అమలాపురం నియోజవర్గాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితరాల శాశ్వత భవన నిర్మాణ పనులకు సంబంధించి క్షేత్రస్థాయి సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలకు అనుగుణంగా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో పురోగతి ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను అప్‌లోడ్ చేస్తూ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు త్వరితగతిన పనులు పూర్తిచేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఇసుక సరఫరా, భూమి తదితరాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జాప్యం చేయకుండా జిల్లాస్థాయి అధికారుల సహాయంతో తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రారంభం కాని భవనాలకు సంబంధించి వెంటనే గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రూపంలో సమర్థవంతమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారికి మార్గనిర్దేశనం చేస్తూ వీలైనంత త్వరగా భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కన్వర్జన్స్ పనుల్లో జిల్లాను ముందువరుసలో నిలిపేందుకు ఎప్పటికప్పుడు లోపాల సవరణతో, సమర్థవంతమైన కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరికిరణ్ ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బీఎస్ రవీంద్ర; రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ ఈఈలు ఏబీవీ ప్రసాద్, కె.చంటిబాబు, బీవీఎస్ఎన్ సత్యనారాయణ మూర్తి, ఏడు నియోజకవర్గాల డీఈలు, ఏఈలు హాజరయ్యారు.