మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శుక్రవారం మల్కాపురం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు వాక్సినేషన్ చురుగ్గా జరగాలని మేయర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. నేడు స్పెషల్ డ్రైవ్ ద్వారా జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక కేంద్రాలలోనూ సచివాలయాలలో లక్ష మందికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని, సాయంత్రానికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 45 సంవత్సరాలు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, టీచర్స్ కు వేయడం జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద సిబ్బందికి సహకరించి, ఒక క్రమ పద్ధతిలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎఫ్.ఆర్.యు. కేంద్రంలోని పరిసరాలను, మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఉపయోగించిన వెంటనే శుభ్రపరచాలి శానిటరీ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదని వాటిని శుభ్రపరచి ఫినాయిల్ వాడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూర్ణశ్రీ, పి.వి.సురేష్, గేదెల లావణ్య, ప్రధాన వైద్యాధికారి డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.