చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర పట్టణాభివృద్ది, పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి శనివారం ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన వస్త్రాలను, నూలు ఒడికే రాట్నాన్ని ఆశక్తిగా తిలికించారు. ఈ సందర్భంగా చేనేత జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు పెద్దిరాజు మాట్లాడుతూ, చేనేత రంగానికి ప్రాధాన్యత నివ్వడంతోబాటు, నేతన్నను గౌరవించడం కోసం 2015 నుంచి ప్రతీఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. చేనేత రంగానికి దేశంలో అతి ప్రాచీన చరిత్ర ఉందని, భారతీయ చేనేత వస్త్రాలకు దేశవిదేశాల్లో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో నేత కార్మికులకోసం ప్రభుత్వ పరంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే, చేనేత వస్త్రాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ప్రదర్శనలో నారాయణపురం, కొట్టక్కి, కోటగండ్రేడు, డెంకాడ చేనేత సహకార సంఘాలు తమ ఉత్పత్తులతో పాల్గొంటున్నాయని ఏడి పెద్దిరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జె.వెంకటరావు, ఇతర ఉన్నతాధికారులతోపాటుగా, అప్కో డిఎంఓ బివి రమణ, మేనేజర్ చిన్నారావు, చేనేత జౌళిశాఖ అభివృద్ది అధికారులు శ్రీనివాసరావు, వసంత, ఏడిఓలు వల్లి, రమణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.