మత్స్యసంపద యోజన పథకం క్రింద జిల్లాలోని 35 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, ఐస్ బాక్సులు, ఇతర సామగ్రిని సబ్సిడీపై పంపిణీ చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద శనివారం ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఏ.సూర్యకుమారి కార్యక్రమంలో పాల్గొని, లబ్దిదారులకు యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ డిప్యుటీ డైరెక్టర్ ఎన్.నిర్మలాకుమారి మాట్లాడుతూ, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు పిఎంఎంఎస్‌వై 2020-21 పథకం క్రింద జిల్లాలోని 35 మంది మత్స్యకారులకు ద్విచక్రవాహనాలను, ఐస్‌బాక్సులను అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ వాహనాలు మత్స్యసంపదను జాప్యం లేకుండా, వినియోగదారులవద్దకు తీసుకువెళ్లి విక్రయించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. దీనివల్ల ఇటు వినియోగదారులకు కూడా ప్రయోజనం చూకూరుతుందని చెప్పారు. ఒక్కో యూనిట్ విలువ రూ.75వేలు అని, దీనిలో ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు రూ45వేలు సబ్సిడీ, ఇతరులకు రూ.30వేలు సబ్సిడీని ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో మంజూరు చేసిన యూనిట్లలో ఐదు ఎస్‌సిలకు, ఐదు ఎస్‌టిలకు, 5 మహిళలకు, 20 ఇతరులకు మంజూరు చేసినట్లు డిడి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎంఎల్‌సిలు, ఎంఎల్ఏలు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతోపాటుగా, మత్స్యశాఖ ఏడి వి.కిరణ్ కుమార్, ఎఫ్‌డిఓలు టి.నాగమణి, యు.చాందినీ, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.