జిల్లా అభివ్రుద్ధికి కలసికట్టుగా పనిచేయాలి..


Ens Balu
2
విజయనగరం
2021-08-07 13:24:43

ప్రజా సమస్యల పరిష్కారానికి  జిల్లా సమీక్షా సమావేశం చక్కని వేదిక అని, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టి గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.  కలెక్టరేట్   ఆడిటోరియం లో శనివారం జిల్లా ఇంచార్జ్ మంత్రి   అధ్యక్షతన జిల్లా  సమీక్షా సమావేశం జరిగింది.  వ్యవసాయం , నీటిపారుదల, కోవిడ్, హౌసింగ్ , ఉపాధి హామీ తదితర అంశాల పై  జిల్లా సమీక్షా సమావేశం లో  చర్చించారు.  ఈ సందర్భంగా  ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ  సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువుగా పాలన  అందిస్తూ సంక్షేమ పధకాలను పారదర్శకంగా ప్రజలకు అందించడం జరుగుతొందన్నారు.  సంక్షేమ పధకాల అమలులో జిల్లా ప్రధమ స్థానం లో ఉండడం ఆనందంగా ఉందని,    సమీక్షా సమావేశం లో ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి  ఆమోదయోగ్యమైన  చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.
          ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ  తోటపల్లి ప్రాజెక్ట్  నిర్వాశితులకు పునరావాస ప్యాకేజి త్వరగా అందేలా చూడాలని అధికారులను కోరారు.  నీటి పారుదల, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ఆర్ అండ్ ఆర్  చెల్లింపుల పై బాధ్యత తీసుకొని ఆలస్యం కాకుండా చెల్లింపులు చేయాలనీ సూచించారు.  ప్రభుత్వం నుండి   రైతుకు అందే లాభాలన్నీ ఈ  క్రాప్ నమోదు ద్వారానే అందుతున్నాయని,  సచివాలయాల్లో ఈ-క్రాప్ నమోదు సక్రమంగా జరగడం లేదని తన దృష్టికి వచ్చిందని, వ్య్వవసాయ అధికారులకు, సచివాలయ సిబ్బందికి మధ్య సమన్వయం లోపం లేకుండా చూడాలని  అన్నారు.   వికలాంగ పించన్ల ను ఎలాంటి సమాచారం  లేకుండా రద్దు చేసేసారన, అర్హులైన వారందరికి పునరుద్ధరించాలని కోరారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు కోలగట్ల వీర భద్ర స్వామి, రాజన్న దొర కలుగ చేసుకొని తమ పరిదిలోనున్న పించన్లు కూడా చాల వరకు రద్దు చేసారని , అందులో అర్హులైన వారు కూడా ఉన్నారని అన్నారు. . సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ మాటలాడుతూ వికలాంగుల పించన్ 3 వేలు అందుకుంటున్న వారిలో  కొంత మంది దీర్ఘ కాలిక  వ్యాధుల పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందువల్ల వారికీ డూప్లికేట్ ఐ.డి కార్డులు  వచ్చాయని, అందువలన పించన్ రద్దు అయ్యిందని వివరించారు.  అయతే  తను సెర్ప్ అధికారులతో మాట్లాడానని, జాబితాలను రీవెరిఫై చేస్తున్నామని , అర్హులైన వారందరికి సెప్టెంబర్ నెల నుండి పించన్ వస్తుందని వివరించారు.  మంత్రి  బొత్స   స్పందిస్తూ     నియోజకవర్గం వారీగా జాబితాలను పునః పరిశీలన చేసి సంబంధిత శాసన సభ్యులకు  సమాచారం అందించాలని సూచించారు.  అనర్హులను జాబితా లోచేర్చి, అర్హులకు మంజూరు చెయ్యడం లో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన  వారి పై  చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసారు.  అనర్హులైన వారు ఎందుకు అనర్హులో స్పష్టంగా కారణాలను కూడా పెర్కొనా లన్నారు.
       పురపాలక , పట్టాణాభివృద్ధి శాఖా మంత్రి   బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  ప్రస్తుతం జిల్లాలో వర్ష పాతం  మైనస్ 22 శాతం  నమోదైన దృష్ట్యా  వర్షాభావ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని, అందుకు ప్రత్యామ్నాయ  ప్రణాళిక తో సిద్ధంగా ఉండాలని వ్యవసాయ , నీటి పారుదల అధికారులకు సూచించారు.  ఈ నెలలో కూడా వర్షం పడక పోతే  వరి నారు  కోసం స్వంతంగా ఏర్పాట్లు గావిన్చుకునేలా రైతులకు  ఆర్.బి.కే ల ద్వారా అవగాహన కలిగించాలని సూచించారు.  విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ,  పరిస్థితుల పై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సమీక్షించాలని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు ద్వారా నే రైతులకు ఉపకరణాలను  అందిస్తుందని,  ప్రభుత్వ పాలసీ కి విరుద్ధంగా ఏమి జరగకూడదని అన్నారు.   జలవనరుల ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు.  తోటపల్లి, తారక రామ తీర్ధ సాగర్,   మిగిలిన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశాన్ని  ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని జలవనరుల చీఫ్ ఇంజినీర్ కు సూచించారు.
        కోవిడ్ థర్డ్ వేవ్ కు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని, ఆసుపత్రులలో అవసరమగు  వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలని,   ఆక్సిజన్ ,మందులు బెడ్స్ తదితర వసతులను  ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. కోవిడ్ లక్షణాలున్న వారికీ ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు.   45 ఏళ్ళు నిండిన వారందరికి వాక్సినేషన్  వేయాలని , ప్రభుత్వ నిబందనల ననుసరించి తల్లులకు, గర్భిణీలకు కూడా  వాక్సిన్ వేయాలన్నారు.  వై.ఎస్.ఆర్. జల కళ పధకం క్రింద బోర్లు  మంజూరు  చేసిన వివరాలను  నియోజక వర్గం వారీగా సంబంధిత  శాసన  సభ్యులకు  రిమార్క్ ల  తో  అందజేయాలని  సూచించారు.  జగనన్న పచ్చ తోరణం క్రింద  1200 కి.మీ లలో అవెన్యూ ప్లాంటేషన్ జరపాలని, మొక్కలను నాటడమే కాకుండా బతికేలా ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయాలనీ డుమా పి.డి కు  ఆదేశించారు.  జగనన్న కాలనీ లలో బోర్లు, విద్యుత్ కనెక్షన్  తదితర మౌలిక వసతలును   కల్పించాలన్నారు.
       గృహ నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ పనులకు ఇసుకను  తరలించే నాటు  బండ్లను అడ్డుకోవద్దని పోలీస్ అధికారులకు సూచించారు.  ట్రాక్టర్ల ద్వారా తరలించే వాటికి  రసీదులు చూపించాలని అన్నారు.
          జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి  సభ్యులకు  స్వాగతం  పలికారు.  సమావేశం అనంతరం ఆమె  మాట్లాడుతూ  గౌరవ సభ్యుల సూచనలను సలహాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేసేలా చూస్తామన్నారు.  జిల్లా అభివృద్ధికి  ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని, అందరి నీ సమన్వయం చేసుకుంటూ ప్రగతి సాధిస్తామని తెలిపారు.

          సమావేశం లో శాసన  మండలి సభ్యులు డా. సురేష్ బాబు , శాసన  సభ్యులు  కోలగట్ల వీర భద్ర స్వామి,  బొత్స అప్పల నరసయ్య, బడ్డుకొండ అప్పల నాయుడు, అలజంగి జోగా రావు, కడుబండి శ్రీనివాస రావు,  శంబంగి  వెంకట చిన్న అప్పల నాయుడు,  రాజన్న దొర, సంయుక్త కలెక్టర్  జి.సి.కిషోర్ కుమార్,  వెంకట రావు , సబ్ కలెక్టర్ భావన, ఐ.టి.డి.ఎ పి.ఓ కుర్మనాద్, , జిల్లా అధికారులు పాల్గొన్నారు.