సీఎంను అభినందించిన ఎంపీడీవోలు..


Ens Balu
2
Srikakulam
2021-08-07 15:21:31

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని జిల్లా ఎంపీడీవోల సంఘం అభినందించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో దీర్ఘకాలికంగా ప్రమోషన్లపై ఉన్న పరిస్థితిని తొలగిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా, ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని, సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందేలా కృషిచేస్తామని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. 
గ్రూప్-1 ద్వారా నియమితులైన ఎంపీడీవోలు, గడిచిన 25 సంవత్సరాల నుంచి ఒక్క పదోన్నతికి నోచుకోకుండా పడుతున్న మనోవేదనను అర్థం చేసుకుని, పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను వన్ టైం సెటిల్మెంట్ (One Time Measure) విధానం ద్వారా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి,  పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లకు జిల్లా ఎంపిడీవోల సంఘం ధన్యవాదాలను తెలియజేసింది.

ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ద్వారా పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి, ఎంపిడీవో మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన వేలాది మంది పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు మెరుగుపడటం పట్ల ఎంపిడీవోలు, పంచాయితీ రాజ్ ఉద్యోగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేసారు. దీని ద్వారా జిల్లా పరిషత్ సిఈఓ, డిప్యూటీ సిఈఓ, డివిజనల్ అభివృధ్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్ట్ లు రెగ్యులర్ బేసిస్ లో భర్తీ కానున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి,  పంచాయతీ రాజ్ మంత్రి, జిల్లా మంత్రులకు ప్రత్యేక  ఎంపీడీఓల సంఘం తెలియ జేసింది. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు యం.రోజారాణి, రాష్ట్ర సంఘం సభ్యులు హేమసుందర్, కిరణ్ కుమార్, విద్యాసాగర్ , వెంకటరమణ మరియు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.