విశాఖ జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ ఎ. మల్లిఖార్జున సంబంధింత అధికారులను ఆదేశించారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జరిగింది. దీనిలో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ ప్రభుత్వం విడుదల చేసిన జీవో. నెం.142లో పేర్కొన్న నిబంధనలు, అర్హతలపై సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు, పరిశీలన ప్రక్రియ గురించి సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వి. మణిరామ్ కమిటీకి వివరించారు. కొంతమంది అర్హత కలిగినప్పటికీ సంబంధిత పత్రాలు ఆన్‌లైన్లో సమర్పించలేదని కమిటీకి తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, కమిటీ ఛైర్మన్ వారందరికీ తగిన సమయం ఇచ్చి సంబంధిత ధృవపత్రాలు సమర్పించుకోమని చెప్పాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్, కమిటీ ఛైర్మన్ ఎ. మల్లిఖార్జున మాట్లాడుతూ తొలి రెండు జాబితాల్లో కలిపి మొత్తం 474 మంది అక్రిడిటేషన్లకు అర్హత సాధించారని పేర్కొన్నారు. రెండు దఫాల్లో కలిపి పత్రికా రంగానికి సంబంధించి 291 మందికి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 183 మందికి అక్రిడిటేషన్ల మంజూరు చేస్తున్నట్లు వివరించారు. మిగిలిన వారు నిర్ణీత గడువులోకా సంబంధిత పత్రాలు సమర్పించాలని ఈ సందర్భంగా చెప్పారు. తదుపరి సమావేశం ఆగస్టు 20వ తేదీన నిర్వహించనున్నామని ఈ లోగా అర్హత ఉండి కూడా సరైన దరఖాస్తులు సమర్పించని వారు నిర్ణీత గడువులోగా సంబంధిత పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వారి దరఖాస్తులు పరిశీలించి తదుపరి సమావేశంలోగా నివేదిక సమర్పించాలని సమాచార శాఖ ఉప సంచాలకులకు సూచించారు. సమావేశంలో అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వి. మణిరామ్, సభ్యులైన డీఎం&హెచ్‌వో పి.ఎస్. సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సునీత, ఏసీటీవో పి. శ్వేత, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఇంద్రావతి తదితరులు పాల్గొన్నారు.