వ్యర్ధాలను వెంటవెంటనే తొలగించండి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-07 15:32:23

విశాఖ మహానగరంలో రోడ్లు, కాలువలు శుభ్రం చేసిన వ్యర్ధాలను వెంటవెంటనే డంపింగ్ యార్డు కు తరలించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె నాలుగవ జోన్ 36 వ వార్డు రంగిరీజు వీధి, జాలారి పేట, ఎవిఎన్ కాలేజి తదితర ప్రాంతాలలో పర్యటించారు. జాలరిపేట నుండి ఎవిఎన్ కాలేజి రోడ్డులో స్వీపింగ్ సరిగా చేయలేదని, కాలువలు శుభ్రపరచి వ్యర్ధాలను పోగులుగా ఉండడం గమనించి శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పోగులను వెంటవెంటనే తొలగించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ, మలేరియా పై సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతుందా అని ఆరాతీయగా, ప్రతీ రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్త తీసుకుంటున్నారని, మలేరియా విభాగం వారు వారంలో 2 రోజులు మలేరియాపై అవగాహన కల్పిస్తున్నారని స్థానికులు కమిషనర్ కు వివరించారు. వార్డులో మలేరియా, డెంగ్యూ కేసులు ఎన్ని ఉన్నాయని, కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను, మలేరియా సిబ్బందిని ఆదేశించారు. ఇపిడిసిఎల్ వారు విధ్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లు కొమ్మలను తొలగించి వ్యర్ధాలను అక్కడే వదిలేస్తున్నారని, వ్యర్ధాలను వెంటనే తొలగించనందుకు ఇపిడిసిఎల్ వారి నుండి అపరాధ రుసుం వసూలు చేసి, వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పుడే తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త గురుంచి వారికి అవగాహన కల్పించి, చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని తెలియజేయాలన్నారు.  బీచ్ రోడ్డులో వాకర్స్ చేతిలొని పెంపుడు కుక్కలను రోడ్లపై మలమూత్రం చేయంచడం గమనించి వారిని మందలించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వీరయ్య, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.