75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను కోరారు. శనివారం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 15వ తేదీన స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహించేందుకు చేపట్ట వలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకోనున్న 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తోందని, జిల్లా స్థాయి ఉత్సవాలలో కూడా ఈ మహోత్సవ్ సందర్భంగా జారీ చేసిన లోగోను అన్ని శాఖల స్టాళ్లు, శకటాలు, ఫలకాల పై విస్తృతంగా ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిగ్నేట్ చేసిన మంత్రివర్యులు ముఖ్య అతిధిగా ఈ వేడుకలు జరుగుతాయని, వేడులను కోవిడ్-19 పరమైన అన్ని ప్రామాణిక జాగ్రత్తలతో నిర్వహించాలని ఆదేశించారు. స్వాతంత్య్య దినోత్సవ వేడుకల కొరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను సిద్దం చేసి, పతాక వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ కవాతు, బాండ్ తదితర సాంప్రదాయ అంశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన పోలీస్ శాఖను కోరారు. అలాగే వేడుకలు జరిగే వేదిక ప్రాంగణంలోను, బయట ట్రాఫిక్ నియంత్రించి అవరోధాలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్య అతిధి ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగ సందేశాన్ని జిల్లాలో అమలౌతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో సిద్దం చేయాలని సమాచారశాఖ డిప్యూటీ డైరక్టర్ ను ఆదేశించారు. వేడుకల సమయంలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సమాచారశాఖ డిఈఈని ఆదేశించారు. వేడుకలకు హాజరైయ్యే స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులకు ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్య మర్యాదలు పాటించాలని, కోవిడ్ దృష్ట్యా సురక్షితమైన ప్యాక్డ్ ఫుడ్ ను మాత్రమే అందించాలని కాకినాడ ఆర్డిఓ కు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేడుకల ప్రాంగణంలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని సిద్దంగా ఉంచాలని జిల్లా అగ్నిమాపక అధికారిని, ఫస్ట్ ఎయిడ్ పోస్ట్, ఆంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. వేడులక ప్రాంగణంలో పారిశుభ్రత, ప్రజలకు త్రాగునీటి సరఫరా అంశాల ఏర్పాట్లను కాకినాడ మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. వివిధ అభివృద్ది, సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లు వాటి పథకాల సమాచారంతో ఆకర్షనీయమైన శకటాలను ప్రదర్శించాలని, అలాగే ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలు, కళాశాలల విద్యార్థులతో దేశ భక్తి పూరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని డిఈఓ, ఉన్నత విద్య అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని వేడుకలలో సత్కరించేందుకు ఆయా శాఖాధిపతులు ఈ నెల 10వ తేదీ లోపున ప్రతిపాదనలు అందజేయాలని కోరారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన బ్యాంకర్లు, సచివాలయాల ఫంక్షనరీలని కూడా ప్రశంసా పురస్కారల కొరకు ప్రతిపాదించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను దేశ భక్తి, జాతీయతా భావనలు వెల్లివిరిసేలా శోభాయమానంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులందరినీ కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి, ఎపిఎస్పి 3వ బెటాలియన్ కమాండెంట్ సుమీత్ గరుడ్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఎన్.సి.సి. గ్రూప్ కమాండెంట్ కల్నల్ ఏకె రుషి, కాకినాడ ఆర్డిఓ ఎజి చిన్నికృష్ణ, సమాచార శాఖ డిడి బి.పూర్ణచంద్రరావు, డిఈఓ ఎస్.అబ్రహాం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.