పారిశుధ్య సిబ్బందికి డ్రైరేషన్ కిట్లు..
Ens Balu
2
Kakinada
2021-08-07 15:41:55
కోవిడ్ కష్టకాలంలో కాకినాడ జీజీహెచ్‌లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్, పారిశుద్ధ్య సిబ్బందికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల (డ్రై రేషన్) కిట్లను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పంపిణీ చేశారు.. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు వైకుంఠేశ్వర దాస సమక్షంలో కలెక్టర్ హరికిరణ్.. పది మంది జీజీహెచ్ సిబ్బందికి సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో జీజీహెచ్ పారిశుద్ధ్య, భద్రత తదితర విభాగాలకు చెందిన సిబ్బందికి బియ్యం, గోధుమపిండి, కందిపప్పు, వంటనూనె, శనగలు, పంచదార వంటి నిత్యావసర వస్తువుల కిట్లను అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 500 మంది జీజీహెచ్ సిబ్బందికి ఈ వస్తువుల కిట్లను అందజేసినట్లు అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు వైకుంఠేశ్వర దాస తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డా. నిష్క్రించిన భక్తదాస ధన్యవాదాలు తెలియజేసినట్లు వెల్లడించారు. పేదలకు మూడువేల డ్రై రేషన్ కిట్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలనుకునే దాతలు 8096211108 నంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి; ఆర్ఎంవోలు డా. ఇ.గిరిధర్, డా. అనిత; అక్షయపాత్ర ఫౌండేషన్ కాకినాడ మేనేజర్ టి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.