పేదల కష్టాలను సీఎం మనసుతో చూస్తున్నారు..


Ens Balu
4
Kakinada
2021-08-07 15:43:31

పేద‌ల క‌ష్టాల‌ను క‌ళ్ల‌తోనే కాకుండా మ‌న‌సుతో చూసి బ‌ల‌హీన వ‌ర్గాల అభున్న‌తికి కృషిచేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే నేత‌న్న‌ల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ అన్నారు. శ‌నివారం ఉద‌యం కాకినాడ‌లోని గాంధీన‌గ‌ర్ మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. తొలుత మ‌హాత్ముని చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించిన అనంత‌రం మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. చేనేత వారోత్స‌వాల (ఆగ‌స్టు 7-14)తో పాటు ఆప్కో చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న (ఆగ‌స్టు 7-18)ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ముర‌మండ, పులుగుర్త‌, ప‌స‌ల‌పూడి, గొల్ల‌ప్రోలు, పెద్దాపురం త‌దిత‌ర చేనేత స‌హ‌కార సంఘాలు ప్ర‌ద‌ర్శించిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించి, వాటి విశిష్ట‌త వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ విశిష్ట క‌ళా నైపుణ్యం, మాన‌వ‌జాతి సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప‌జేసే చేనేత రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తోంద‌ని, వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తోందంటే నేత‌న్న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధిని అర్థంచేసుకోవ‌చ్చన్నారు. యాంత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఉపాధి దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో నేత‌న్న‌ల సుస్థిర జీవ‌నోపాధికి ఈ ప‌థ‌కం ఓ దివిటీలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి నిజ‌మైన నేత‌న్న నేస్త‌మ‌ని, జిల్లా చేనేత రంగ కార్మికులు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలవాలని.. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ నేతృత్వంలో కీల‌క ప్రాజెక్టుల‌తో చేనేత రంగ అభివృద్ధి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలోనూ నేత‌న్న‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఉప్పాడ‌, మోరి, అంగ‌ర త‌దిత‌ర ప్రాంతాల చేనేత క‌ళ‌కు ఎంతో గుర్తింపు ల‌భించింద‌న్నారు. మ‌నం ఎద‌గాలంటే ప్ర‌పంచాన్ని ఎర‌గాల‌ని.. ప్ర‌పంచాన్ని ఎర‌గాలంటే విద్య కావాల‌ని.. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యారంగ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, మ‌న‌బ‌డి నాడు-నేడు వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు మంత్రి వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. 

చేనేత రంగ అభివృద్ధికి కృషి: క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌:
భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  స్వ‌దేశీ ఉద్య‌మం 1905, ఆగ‌స్టు 7న ప్రారంభ‌మైన చారిత్ర‌క ఘ‌ట్టానికి గుర్తుగా ఏటా ఆగ‌స్టు 7న మ‌నం జాతీయ చేనేత దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా పథకాలు  అమ‌లుచేస్తోంద‌ని.. వైఎస్సార్ నేత‌న్న నేస్తం ద్వారా జిల్లాలో 2019-20లో 6,964 మందికి రూ.16,71,36,000; 2020-21లో 7,817 మందికి రూ.18,76,08,000 మేర ల‌బ్ధిచేకూరిన‌ట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలకే వెళ్తోంద‌న్నారు. అదే విధంగా ఈ నెల 10వ తేదీన మూడో విడ‌త‌గా ప‌థ‌కం ద్వారా 6,919 మందికి రూ.16,60,56,000 మేర ల‌బ్ధి చేకూర‌నున్న‌ట్లు వివ‌రించారు. బ‌య‌ట అధిక వ‌డ్డీల భారం నుంచి త‌ప్పించేందుకు వీలుగా పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కాన్ని కూడా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. వైఎస్సార్ నేతన్న‌నేస్తం ప‌థ‌కం చేనేత కుటుంబాల అభివృద్ధికి, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల‌ను ప్రోత్స‌హించేందుకు, స‌హ‌కార సంఘాల‌కు మార్కెటింగ్ ప్ర‌యోజ‌నాల‌ను అందుబాటులో ఉంచేందుకు, ఈ రంగం ఆవ‌శ్య‌క‌త‌, విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌త్యేక వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రామ‌చంద్రాపురం, రాయ‌వ‌రం మండ‌లాల‌కు చెందిన వీర‌సూర్యం, వీర‌భ‌ద్ర‌రావు నేత‌న్న‌ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ త‌దిత‌రులు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ రెండో డిప్యూటీ మేయ‌ర్ చోడిప‌ల్లి వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, స్థానిక కార్పొరేట‌ర్ గోడి స‌త్య‌వ‌తి; జిల్లా చేనేత‌, జౌళి శాఖ స‌హాయ సంచాల‌కులు ఎన్‌.ఎస్‌.కృపావ‌రం, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.