అల్లూరి.. అన్యధా భావించకండి..
Ens Balu
6
Krishnadevipeta
2021-08-08 09:55:22
అవును.. కేంద్రమంత్రి అయితే మాత్రం ఏమున్నది గర్వకారణం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్పా.. భరత భూమిలో తెలుగుజాతీ జీవితాంతం గుర్తుంచుకునే వీరుడికోసం ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి ఒక్కప్రకటన కూడా చేయని పర్యటన.. సభ్యసమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లో తెలియని దుస్థితి.. అల్లూరి అన్యధా భావించకండి.. నాటి నుంచి నేటి వరకూ మీ విషయంలో ఇదే నిర్లక్ష్యం మరోసారి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ విషయంలోనూ రుజువైంది. బహుసా మీ విగ్రహం పార్లమెంటులో పెట్టమని అడుతారనో.. లేదంటే మీకు భారత రత్న అడుగుతారనో.. అదీకాదనుకుంటే కేంద్రం తరపునైనా ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయమంటారని, నాటి మీవీరోచిత చరిత్ర బాహ్య ప్రపంచానికి వాస్తవాలతో తెలియజమని ఇబ్బంది పెడతారనో తెలీదు కానీ.. అందరిలానే మిమ్మల్ని చూడటానికి వచ్చిన మంత్రి వర్యులు దండేసి దండంపెట్టి ఇంతకంటే ఏం చేయగలమని మౌనంగానే వెళ్లిపోయారు. 75ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో తప్పుని తప్పుగా ఎవరూ వేలెత్తి చూపకూడదు. అలా చూపించడమూ భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీ తప్పు.. నేతల ప్రసంగాలకు మీ వీరోచిత చరిత్రకావాలి.. వారి గెలుపునకు మీరు త్యధించిన త్యాగం కావాలి.. వారి ప్రసంగాలకు మీరే ఒక వేదిక కావాలి కానీ.. మీకోసం మాత్రం ఏ ఒక్క నేత ముందుకి వచ్చి.. ఇదిగో భరతమాత ముద్దుబిడ్డకోసం, స్వాతంత్ర్య సమరయోధుడి కోసం మా ప్రభుత్వం లో ఈ పనిచేశామని చెప్పే దైర్యమున్న నేతలు లేకపోయారంటే పరిస్థితి ఎలా వుందో మీరే అర్ధం చేసుకోండి. ప్రపంచ దేశాలకు అల్లూరి వీరోచిత పోరాటం ఒక ఆదర్శం, ఆయన చరిత్ర ఒక సందేశం, కానీ భారతదేశంలో మాత్రం అది చదువుకోవడానికే మిగిలి వున్నట్టుగానే మారిపోయింది. మీరు పుట్టి.. మాకోసం ఈ పుణ్యభూమిలో ప్రాణాలను వదిలిన మీ త్యాగాన్ని పట్టించుకోని మమ్మల్ని.. ఎప్పటి లాగానే మీరు మీ సమాధి నుంచే చూస్తూ ఉండిపోండి.. మీపేరుతో చట్టసభల్లో ప్రసంగాలు ఇచ్చేసమయంలో మీ కోసం తలచుకున్నపుడు నా భారతీయులు నన్ను తలచుకుంటున్నారని కాస్త మాత్రమే సంబరపడండి.. అంతకు మించి ఏమీ ఊహించుకోకండి.. అసలేమీ ఉండదని మంచి మనసుతో అర్ధం చేసుకోండి. మన్యంలో మహోదయం స్రుష్టించిన మన్యవీరా, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజా మా చేతకాని తనాన్ని చూసి అన్యదా భావించవద్దు..బాధపడవద్దు.. జోహార్ అల్లూరి, జోహార్..!