చేనేతకారుల జీవితాలలో వెలుగులు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హోటల్ గ్రాండ్ లో మూడు రోజుల చేనేత ప్రదర్శనను నాబార్డు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కారుల నెలసరి ఆదాయం పెరగాలని అన్నారు. జిల్లాలో చేనేత కారులు, చేనేత పరిశ్రమ వివరాలు పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్రాండింగ్, మార్కెటింగుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ రంగంలో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు సంభందించి ఎక్కువ ప్రదర్శనలు జరగాలని తద్వారా ఎక్కువ అవకాశాలు రావడానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేత కారులు స్వయం సమృద్ది సాధించాలని ఆయన అన్నారు. అందుకు అందరూ సమష్టిగా పనిచేద్దామని కోరారు.
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రంగంలో చేనేత పెద్ద రంగంగా ఉందన్నారు. చేనేత కుటీర పరిశ్రమగా అదనపు ప్రక్రియగా ఎక్కువగా చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగానికి 1982 నుండి నాబార్డు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. చేనేత ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. చేనేత రంగానికి అవసరమైన నైపుణ్యం అభివృద్ధికి సంఘాలు చాలా చేస్తున్నాయని ఆయన తెలియజేస్తూ బ్రాండింగ్ కు సహాయం చేస్తామని పేర్కొన్నారు. వెబ్ సైట్ తయారు చేస్తామని దానిని ఒక విక్రయ సదుపాయంగా వినియోగించు కావాలని సూచించారు. చేనేత రంగానికి లాభదాయకతకు నాబార్డు ప్రయత్నం చేస్తోందని, పొందూరుకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో వినియోగం ఉందని, జాతీయ అంత్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనాలని ఆయన సూచించారు.
అప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా అవసరమగు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ చౌసాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అందరికీ తెలియాలని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఉండేదని ఈ ఏడాది నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకు సిజిఎం నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో పొందూరులో 11 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జన్మ దినోత్సవంలో భాగంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ, నాబార్డు డిజిఎం ప్రసాద్, డిసిసిబి ముఖ్య కార్యనర్వహణాధికారి డి. సత్యనారాయణ, రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు, ఆర్ట్స్, బెజ్జిపురం యూత్ క్లబ్, సిఎవిఎస్ స్వచ్చంధ సంస్థల డైరెక్టర్ లు నూక సన్యాసి రావు, ఎం.ప్రసాద రావు, పడాల భూదేవి., సురంగి మోహన రావు, గీతా శ్రీకాంత్, దుప్పల వెంకట రావు, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన చెనేతకారులు తదితరులు పాల్గొన్నారు.