శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత శ్రీకాకుళాన్ని తీర్చి దిద్దే బాధ్యత అందరిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తపోథన్ దెహారి అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి జి ఎం ఆదేశాల మేరకు జిల్లాలోని 66 శాఖలు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటుతున్నామని వివరించారు. రాష్ట్రము మొత్తం స్టేట్ బ్యాంకు అద్వర్యం లో మెగా ట్రీ ప్లేటేషన్ చేపట్టడం జరుగుతోందని ఆయన వివరించారు. ఎస్బిఐ ప్రతి ఏడాది మొక్కలు నాటడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. కరోనా విపత్కర వేళ ఆక్సిజన్ అందక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న వారికి ఎస్బిఐ ఇతోధికంగా ఋణాలు అందించేందుకు సిద్దంగా ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ ఆవశ్యకతను గుర్తించి ఎస్బిఐ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోందని చెప్పారు. త్వరలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని ఎస్బిఐ శాఖల్లో శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎస్బిఐ శాఖల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత విధానం చేపట్టనున్నట్లు తపొదన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్న స్టేట్ బ్యాంక్ ను అభినందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకువచ్చి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషదాయకం అన్నారు. జిల్లాలో 11 శాతం మాత్రమే అటవీ ప్రాంతం కలిగి ఉండడం వల్ల జిల్లాలో కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయన్నారు. శ్రీకాకుళంని సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు, గ్రీన్ సిటీ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ క్రీడా విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు బ్యాంకర్లు,వాకర్స్ సంయుక్తంగా విక్టరీ చూపిస్తూ జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.100 ఏళ్ల చరిత్రలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన హర్యానా బిడ్డ ,ఇండియన్ ఆర్మీ ఉద్యోగి నీరజ్ చోప్రాకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ స్టాఫ్ యూనియన్, జోనల్ సెక్రటరీలు వెంకటరమణ, ఆఫిసర్స్ సెక్రటరీ వి.ఎస్.ఎన్ సాహు, జర్నలిస్టుల ఐక్యవేదిక ప్రతినిధులు శాసపు జోగి నాయుడు, కొంఖ్యాన వేణుగోపాల్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కె.వి.ఆర్.మూర్తి, పి.జి.గుప్తా, ఎం.మల్లిబాబు, ఆర్ట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అడపా మోహన్ రాజ్ , పలువురు బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.