రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుకునేలా చైతన్య పరిచే బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆదివారం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎన్నెస్పీ అతిథిగృహంలో ఆయన బస చేశారు. జర్నలిస్టుల సంఘాల నాయకులు చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి విశ్వవిద్యాలయం నిబంధనలు అనుసరించి సొంతంగా సర్టిఫికెట్ కోర్స్ లు ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ వెల్లడించారు. అకాడమీ ఏర్పాటు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 80 తరగతులు రాష్ట్రం, జిల్లాల వారీగా ఆన్ లైన్ లో నిర్వహించడానికి విశ్వవిద్యాలయం అనుసంధానంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. ఏంతో విలువైన ఈ కోర్సుల్లో చేరడం ద్వారా జర్నలిస్టులకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. సీనియర్ అధ్యాపకులుగా నైపుణ్యం కలిగిన వారితోనే తరగతులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
వృత్తిలో నైపుణ్యం, మెలకువలు వంటి పలు అంశాలపై కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. విశ్వ విద్యాలయంతో కలిసి తొలిసారిగా చేపట్టిన సర్టిఫికెట్ కోర్స్ ను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జర్నలిజం విద్యనభ్యసిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు సమర్థంగా వాటిని అధిగమించేలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. జర్నలిజంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామన్నారు. జర్నలిస్టులుగా పని చేస్తున్న వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా ఏపీ ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు. అక్రిడిటేషన్లు ఫిల్టర్ చేసే ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న వారికి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ బారినపడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అధిక ప్రయోజనం కల్పించడం, వారంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
జర్నలిస్టులు విషయ పరిజ్ఞానం మరింతగా పెంచుకోడానికి ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతనంగా రూపొందించిన వెబ్ సైట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఈ వెబ్సైట్ జర్నలిస్టులకు సమాచార వనరులు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ప్రతిరోజు జర్నలిస్టులు వెబ్ సైట్ ను వినియోగించుకొని మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు తన్నీరు మోహన్ రాజు, జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ వి సుబ్బారావు, ఎస్ వి బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, దాసరి కనకయ్య, మీసాల శ్రీనివాసరావు, శ్రీనివాస్ నాయక్, ఇఫ్తేకర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.