ఈ-కేవైసీ చేస్తేనే నిత్యావసర సరుకులు..
Ens Balu
2
Kakinada
2021-08-10 15:27:18
బియ్యం కార్డులోని ప్రతి వ్యక్తి ఆధార్ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని, ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆ వ్యక్తికి చౌక ధరల నిత్యావసరాలు అందుతాయని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్డులో ఉన్న పేర్లలో ఈ-కేవైసీ పూర్తికాని వారికి తహసీల్దార్ లేదా వీఆర్‌వో నుంచి నోటీసులు అందుతాయని, వీటిని అందుకున్న వారు వాలంటీర్ ద్వారా పౌర సరఫరాల శాఖ ఏఈపీడీఎస్ మొబైల్ యాప్‌లో ఆధార్ ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు చేయించుకోవాలని సూచించారు. అదే విధంగా చౌక ధరల దుకాణంలోని ఈ-పోస్ మెషీన్‌లోని ఈ-కేవైసీ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ-కేవైసీ పూర్తికాని సభ్యులను బోగస్ సభ్యులుగా గుర్తించి సెప్టెంబర్ నుంచి నిత్యావసర సరుకుల సరఫరాను నిలిపేయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా వారి పేర్లను కార్డు నుంచి తొలగించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.