ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోండి..
Ens Balu
2
Kakinada
2021-08-10 15:28:38
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక శాశ్వత భవన నిర్మాణ పనులు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక కొరత రానీయొద్దని, వీటికి ప్రాధాన్యమిచ్చి ఇసుక సరఫరా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య నిర్మాణ పనులకు ఇసుక సరఫరాపై మంగళవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్.. డివిజనల్, మండలస్థాయి అధికారులు, జేపీ వెంచర్స్ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరవేసేందుకు వేదికలుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు; రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు తదితరాలకు శాశ్వత భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదిక పూర్తిచేయాల్సి ఉన్నందున జాప్యం లేకుండా ఇసుక సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అదే విధంగా లేఅవుట్లలో జరుగుతున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. ఇసుక రీచ్/స్టాక్‌యార్డు వద్దకు కూపన్లతో వచ్చిన లారీలకు అరగంటలో లోడింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. రీచ్‌లు, స్టాక్ యార్డుల నుంచి ఇసుక సక్రమంగా సరఫరా జరిగేలా చూసేందుకు వీఆర్‌వో/వీఆర్ఏలను నోడల్ సిబ్బందిగా నియమించాలని, ఇందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రీచ్ నుంచి ఎంత ఇసుక ప్రభుత్వ ప్రాధాన్య పనులకు వెళ్తుందనే విషయంపై రోజువారీ సమీక్ష నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.