అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-10 15:39:38

వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అందరూ కలిసి పని చేసినపుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చని  జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున  సూచించారు. మంగళవారం కలెక్టరు వ్యవసాయ, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులతో వారి సమస్యలు  చర్చించి పరిష్కరించాలన్నారు.  మీ పరిజ్ఞానాన్ని రైతులకు అందించి నాణ్యమైన  అధిక ఫల సాయం పొందేందుకు ఉపయోగ పడాలన్నారు.  మండలాలలో పర్యటించినపుడు అక్కడి ప్రత్యేక సమస్యలను బోర్డు సమావేశాలలో ప్రస్తావించాలన్నారు.  బోర్డు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్నారు.  పాడేరు, నర్సీపట్నం ప్రాంతాలలో రైతులతో చర్చించాలన్నారు.  గ్రామ సచివాలయాలలో ఈ శాఖల సిబ్బంది  అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలను అందించాలన్నారు.  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నాణ్యత ప్రమాణాల పరీక్షలు  నిర్వహించి తద్వారా  రైతు భరోసా కేంద్రాలలో రైతులకు  అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  నాణ్యమైన  విత్తనాలను రైతులకు అందించుటలో  రైతు భరోసా కేంద్రాల పాత్ర ప్రధానమైనదన్నారు.   రైతు భరోసా కేంద్రాలలో పని చేసే సిబ్బందిని విత్తన విక్రయించే డీలర్లను  అనుసంధానం చేసి తప్పని సరిగా   వీరు విక్రయించే అన్ని రకాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లోని  సీడ్ టెస్టింగ్ కిట్ ద్వారా మొలక శాతం పరీక్షించి విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో వారపు సంతల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మకుండా చర్యలు తీసుకోసుకొనే విధంగా  రైతులలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలపై యాజమాన్య పద్దతులను గురించి  రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖలను కూడా సంక్షేమ పధకాలు రైతుల శ్రేయస్సు కోసం విరివిగా అందించవలెనని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను నిర్దేశిత కాలపరిమతిలోగా పరిష్కరించాలన్నారు. అంతకు ముందు  ఆయా శాఖల అధికారులు ఆ శాఖలో అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెక్టులు మొదలగు విషయాలను లక్ష్యాలు, సాధించినవి కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో  వ్యవసాయ శాఖ  జెడి  లీలావతి,  పశుసంవర్ధక శాఖ,  ఫిషరీస్,  సెరికల్చర్  శాఖల జె డి లు,  హార్టికల్చర్ డి.డి  తదితరులు పాల్గొన్నారు.