ప్రతి అడుగూ మీ మంచికే వేస్తున్నా..


Ens Balu
4
Srikakulam
2021-08-10 16:19:52

ప్రతి అడుగు మీకు మంచి చేయుటకు వేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇ-మార్కెటింగ్ సౌకర్యం కల్పించుటకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అప్కో ఇందులో చేరాలని ఆయన సూచించారు. వైయస్సార్ ఆర్ నేత నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వరుసగా మూడవ ఏడాది నేతన్న లకు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 80 వేల 32 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ఈ ఏడాది అందిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 576.07 కోట్ల ను నేతన్నలకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు  దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చే అభివృద్ధి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐదేళ్లలో స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని ఆయన పేర్కొంటూ ప్రతి లబ్దిదారునికి రూ.1.20  లక్షల ఆర్థిక సహాయాన్ని అందించుటకు నిర్ణయించామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఈ జాబితాలో లేకపోతే సచివాలయంలో దరఖాస్తు సమర్పించ వచ్చని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో 2021 - 22 సంవత్సరంలో 1601 మందికి రూ.3.84 కోట్లను నేతన్న నేస్తంగా అందించడం జరుగుతుందని తెలిపారు. 2020 - 2021లో 1775 మందికి  రూ. 4.26 కోట్లు,  2019 - 20 సంవత్సరంలో 1457 మందికి రూ.3.50 కోట్లు అందించామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు లాంఛనంగా చెక్కులను పంపిణీ చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, శాసనసభ్యులు కంబాల జోగులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరి బాబు, మామిడి శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, చేనేత సహకార సంఘం ప్రతనిధులు చంద్రయ్య, కె. రవి, ప్రకాష్,  చేనేత శాఖ ఎడి ఎస్ కె అబ్దుల్ రషీద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.