శిధిలమైన డ్రైనేజిలను పునర్నిర్మించాలి..


Ens Balu
4
విశాఖ సిటీ
2021-08-10 16:29:09

విశాఖ మహా నగరంలో శిధిలమైన డ్రైనేజిలను పునర్నించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జివిఎంసి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నాలుగవ జోన్ 37వ వార్డు పరిధిలో గొల్లవీధి, ఆశిపాప వీధి, కొత్త రెల్లి వీధి, జబ్బర్ తోట తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరామ్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ శిధిలమైన డ్రైనేజిలను, పాడైపోయిన సి.సి. రోడ్లను నూతనంగా నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పోలమాంబ గుడి వద్ద కమ్యునిటీ హాలులోని రెండవ ఫ్లోర్ నిర్మాణం నకు సాధ్యాసాద్యాలను పరిశీలించి, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  కాలువలలో చెత్త అధికంగా కనిపిస్తుందని, కాలువలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ రోజూ డోర్ టు డోర్ చెత్తను తప్పనిసరిగా  సేకరించాలని తడి-పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై మహిళా సంఘాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబల కుండా ఫాగింగు చేయాలని మలేరియా సిబ్బందికి సూచించారు.  బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆదేశించారు. వార్డు కార్పొరేటర్, ప్రజలు స్థానిక సమస్యలపై మేయర్ కమిషనర్ కు వివరించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, ఎఎంఒహెచ్ డా. కిషోర్, కార్య నిరవాహక ఇంజినీర్లు చిరంజీవి, గణేష్ బాబు, ఇతర అధికారులు, వై.ఎస్.ఆర్. సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.