విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయలందరికీ కోవిడ్ వేక్సిన్ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి స్పష్టం చేశారు. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, వయస్సుతో సంబంధం లేకుండా, ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు, ప్రయివేటు ఉపాధ్యాయులంతా వేక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు శతశాతం వేక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని, మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేక్సిన్ కావాల్సినవారు జిల్లాలోని ఏ పిహెచ్‌సికి వెళ్లయినా, వేక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. కోవిడ్‌ను కట్టడి చేయడం మన చేతుల్లోనే ఉందని, మనం తగిన జాగ్రత్తలను పాటిస్తూ, వేక్సిన్ వేయించుకుంటే, కరోనాకు భయపడనక్కరలేదని కలెక్టర్ సూచించారు. వేక్సినేషన్ కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. తమ ఇళ్లలోని పెద్దవాళ్లకు నచ్చజెప్పి, వారికి అవగాహన కల్పించి, వేక్సిన్ వేయించాని సూచించారు. వేక్సిన్ వేయించుకున్న అతికొద్ది మందిలో మాత్రమే జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఒకటిరెండు రోజుల్లోనే అవి తగ్గిపోతాయి కాబట్టి, ఎవరూ భయపడ నక్కరలేదని అన్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోందని, సాధ్యమైనంత తక్కువ మందితో వివాహాన్ని జరిపించుకోవాలని కోరారు. తక్కువమందికి పరిమితం చేయడం వల్ల, మన కుటుంబ సభ్యులతోపాటు, మన బంధువులకు కూడా శ్రేయస్కరమని, అందువ్ల వివాహాలకు 20 మందికి మించకుండా చూడాలని కోరారు. విదేశాలకు వెళ్లే యువత వేక్సిన్ కోసం ఏదైనా పిహెచ్‌సికి వెళ్లి, తమ పాస్‌పోర్టును చూపించి, వయసుతో సంబంధం లేకుండా వేక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. వేక్సినేషన్‌కు సంబంధించిన వివరాలకోసం కంట్రోల్ రూము నెంబర్లు 08922275279, 08922227950కు సంప్రదించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డిఇఓ జి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.