గుంటూరు జిల్లాలోని తెనాలి సబ్ డివిజన్ డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ కెనాల్స్ చివర పంట పొలాలకు సైతం సాగునీరు సక్రమంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళగిరి, దుగ్గిరాల, వేమురు మండలాల పరిధిలోని కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్ ద్వారా సాగునీరు ప్రవహిస్తున్న బ్రాంచి కెనాల్స్, చానల్స్ను పరిశీలించారు. మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి వద్ద హైలెవల్ బ్రాంచీ కెనాల్ను, దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు వద్ద బ్రాంచీ కెనాల్ను, దుగ్గిరాల వద్ద లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల వివరాలు, కెనాల్స్ ద్వారా సాగునీరు అందించే గ్రామాల వివరాలను ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టరుకు వివరించారు. అనంతరం వేమురు మండలం వరహాపురం గ్రామంలో ఇరిగేషన్ చానల్ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి పరిశీలించి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. వరహాపురం గ్రామంకు వచ్చే సాగునీటి చానల్కు పై ఎత్తున కాకర్లమూడి గ్రామం వద్ద ఛానల్కు అడ్డుకట్ట వేయటంతో వరహాపురం గ్రామానికి సక్రమంగా సాగునీరు రావటం లేదని స్థానిక రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చానల్కు వేసిన అడ్డంకులు వెంటనే తొలగించటంతో పాటు, మరల అడ్డంకులు వేయకుండా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో 24 గంటలు పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని రైతులకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. వరహాపురం గ్రామంలోని పొలాలకు పూర్తిగా మొదటి విడత సాగు నీరు అందేవరకు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ డెల్టా సబ్ డివిజన్లోని పంట పొలాలకు జూలై ఆరవ తేదీ నుంచి ఇరిగేషన్ కెనల్స్ ద్వారా ప్రతి రోజు 7000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ కెనాల్స్కు సరఫరా అవుతున్న నీటి సరఫరాను వివిధ ప్రాంతాల వద్ద పరిశీలించటం జరిగిందన్నారు. గత రెండు రోజులుగా కెనాల్స్ చివరి భూములకు కొద్దిగా సాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వేమూరు మండలంలోని వరహాపురం గ్రామంకు వచ్చి రైతులతో మాట్లాడటం జరిగిందన్నారు. వరహాపురం గ్రామానికి వచ్చే సాగునీటి చానల్కు పైన ఉన్న రైతులు వేసిన అడ్డంకులను తొలగించి, బ్రీచ్లు గుర్తించిన ప్రాంతాలలో మరమ్మత్తులు చేసి 24 గంటల్లో చివరి భూములు వరకు సాగునీరు అందెలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసి నిరంతరం అవసరమైన ప్రాంతాలలో పోలీస్ శాఖతో బందోబస్తు ఏర్పాటు చేసి అనధికారికంగా నీటిని వాడకుండా, అడ్డంకులు వేయకుండా పర్యవేక్షిస్తూ కెనాల్స్ చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందెలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాద్, దుగ్గిరాల తహశీల్దారు మల్లేశ్వరి, వేమురు తహశీల్దారు శీరిషా, తెనాలి డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరత్నం, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈలు, ఏఈలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.