ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని లబ్దిదారులకు సకాలంలో, సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి.చిన్మయాదేవి ఆదేశించారు. ఆమె గురువారం జిల్లాలో పర్యటించి, తమ శాఖకు సంబంధించిన అధికారులు, సంస్థల ప్రతినిధులతో స్థానిక మహిళా ప్రాంగణంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి చిన్మయాదేవి మాట్లాడుతూ, సిడిపిఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, పోషకాహారాన్ని శతశాతం, సక్రమంగా అందజేయాలని కోరారు. పథకాలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహించినా, నిర్లిప్తత ప్రదర్శించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించాలని, అవి త్వరగా పూర్తిఅయ్యేలా సంబంధి అధికారులను కోరాలని సూచించారు. ఇప్పటికీ ప్రారంభించన భవనాల నిర్మాణాన్ని తక్షణమే, ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాల సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని, మిల్క్‌యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. గృహహింస, దిశ సంబంధిత కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.రాజేశ్వరి, కేర్ ఇండియా ప్రతినిధి సుబ్రమణ్యం, సిడిపిఓలు, సూపర్ వైజర్లు, ఒన్ స్టాప్ సెంటర్, డివి సెల్ సిబ్బంది. చిల్డ్రన్ హోమ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.