పంద్రాగస్టు వేడుకలకి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
1
Vizianagaram
2021-08-12 13:57:09
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు పకడ్భంధీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి చెప్పారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జె.వెంకటరావు, పలువురు ఇతర ఉన్నతాధికారులతో కలిసి, ఆమె గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ను సందర్శించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను, మృతి చెందిన కోవిడ్ వారియర్స్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు, కోవిడ్ నిబంధనల కారణంగా సాధారణ ప్రజలను అమతించడం లేదని చెప్పారు. దీనికి బదులుగా పట్టణంలో పలు చోట్ల డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. యూట్యూబ్ లైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పరిమితంగా ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో అంశాన్ని, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ప్రదర్శిస్తారని చెప్పారు. స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం లేదని, వాటి స్థానంలో వివిధ శాఖల ప్రగతిని వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ఇస్తున్న ప్రశంసా పత్రాలను సైతం రద్దు చేయడం జరిగిందని, మృతి చెందిన కోవిడ్ వారియర్స్ కుటుంబ సభ్యులకు, కోవిడ్ నియంత్రణకోసం విశేష కృషి చేసిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు మాత్రమే మెరిట్ సర్టిఫికేట్లను అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.