తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి జిల్లాలో జరుపనున్న పర్యటనకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు సంయుక్తంగా జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పి.గన్నవరంలో జరిపే పర్యటన కొరకు చేపట్టవలసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఈ నెల 16వ తేదీ ఉదయం 10-30 గం.లకు హెలికాప్టర్ లో పి.గన్నవరం చేరుకుని అనంతరం 11 గం.ల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకూ జడ్పి హైస్కూల్లో తొలి దశ నాడు-నేడు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ది పనులను ప్రజలకు అంకితం చేస్తారని, అలాగే రెండవ దశ నాడు-నేడు పనులను ప్రారంభించి, జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి వారితో బహిరంగ సభలో ముచ్చటిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పి.గన్నవరంలో వివిధ ప్రదేశాలలో చేపట్టవలసిన ఏర్పాట్లకు జాయింట్ కలెక్టర్లను, ఆర్డిఓలను ఆయన ఇన్చార్జిలుగా నియమించారు.
అలాగే పర్యటన కార్యక్రమాలకు హాజరైయ్యే ప్రముఖులు, ముఖ్యమంత్రి సిబ్బంది, విద్యార్థులు, వివిధ జిల్లాలల్లో నాడు-నేడు ఉత్తమ పనులకు అవార్డు గ్రహీతలక, రాష్ట్ర స్థాయి అధికారులకు తగు సదుపాయాలను కల్పించాలని ఆయన ఆదేశించారు. వాహనాలు, సమూహాల నియంత్రణ, బారికేడింగ్, పబ్లిక్ ఎడ్రస్, లైవ్ కవరేజి, మీడియా సమన్వయం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు సూచనలు జారీ చేశారు. రానున్న 5 రోజుల్లో వర్ష సూచన ఉన్నందున, వర్షాల కారణంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఏవిధమైన ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఉనికి నేపద్యంలో పటిష్టమైన జాగ్రత్తలను అమలు పరచాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ భద్రతా పరమైన అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేసి, అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మిశ, కీర్తి చేకూరి, బార్గవతేజ్, జి.రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండక్కర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.