శిక్షణే కాదు.. ఉపాధి కల్పన కూడా కావాలి..


Ens Balu
2
Srikakulam
2021-08-13 17:43:10

యువతకు అందిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు ఉపాధి కల్పన ధ్యేయంగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు శిక్షణ మాత్రమే కాదని, ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థులు ఏ కోర్సుల్లో చేరుతున్నారు, ఏ సంస్థలో ఉపాధి పొందుతున్నారు తదితర అంశాల వివరాలు ఉండాలని ఆయన అన్నారు. ఉపాధి లభించినప్పటికీ ఆ సంస్థలో ఎంత కాలం పని చేస్తున్నారు లేదా ఇతర సంస్థలకు  మారితే అందుకు స్పష్టమైన వివరాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల శిక్షణ ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పూర్తి సమాచారం ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు  ఇందుకు ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని, ఆ యాప్ ద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందుటకు అవకాశం కల్పించాలని సూచించారు. బ్యాంకుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శత శాతం రుణాలు కల్పించి స్వయం ఉపాధికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. నాణ్యమైన శిక్షణ కల్పించడం వల్ల ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. శిక్షణ పొందడం ఒక ఎత్తు అయితే అనంతర పరిణామాలు మరో ఎత్తని వాటిపై స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.  చేనేత కారులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న ఇ కామర్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ లో శిక్షణ కల్పించాలని సూచించారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు మాట్లాడుతూ జిల్లాలో అకడమిక్, నాన్ అకడమిక్ కేటగిరీలుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అకడమిక్ శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు అందిస్తున్నామని,  నాన్ అకడమిక్ రంగంలో నిరుద్యోగ యువతకు వివిధ కార్యక్రమాల కింద శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న యువతకు ల్యాప్టాప్, టాబ్  తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2021 - 22 సంవత్సరంలో కోవిడ్ నేపథ్యంలో 1551 మంది శిక్షణలో చేరగా 336 మంది ఉపాధి పొందారని తెలిపారు. జిల్లాలో ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం నరసన్నపేట మండలంలో మంజూరైందని అందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల ప్రతినిధులు తమ వివరాలను తెలియజేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి జి. శ్రీనివాసరావు, సెట్ శ్రీ ముఖ్య కార్య నిర్వహణాధికారి కె.సూర్య ప్రభాకర రావు, క్రీడల చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, డిఆర్డిఎ పిడి బి.శాంతి శ్రీ,  ఏపీఈడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కర రావు, నాక్ సహాయ సంచాలకులు చిట్టిబాబు, నెహ్రూ యువ కేంద్ర ఏవో డి.శ్రీనివాస్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.