ప్రతీ పాఠశాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, దీనికి ప్రధానో పాద్యాయులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్య, వైద్యారోగ్యశాఖాధికారులతో తన ఛాంబర్‌లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు, చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 3,347 పాఠశాలలను ఈనెల 16 నుంచి పునఃప్రారంభిస్తున్నామని, తరగతి గదికి 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, రోజువిడిచి రోజు బ్యాచ్‌ల వారీగా తరగతులు నిర్వహించాలని సూచించారు. పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు లాంటి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, వారిని స్కూలుకు అనుమతించవద్దని ఆదేశించారు. ఏదైనా తరగతిలో కోవిడ్ పాజిటివ్ నమోదైన పక్షంలో, ఆ తరగతిలోని పిల్లలందరికీ టెస్టులను నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు మాస్కులను, శానిటైజర్‌ను ఇవ్వాలని, చేతులను తరచూ కడుగుకొనే ఏర్పాటు చేయాలని సూచించారు. మధ్యాహ్నం భోజనానికి కూడా బ్యాచ్‌ల వారీగా, 10 నిమిషాల విరామంతో పంపించాలన్నారు.
ప్రతీరోజూ ఏఎన్ఎంలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో ఏఎన్ఎం కు సుమారు 3 పాఠశాలలను అప్పగించాలన్నారు. పాఠశాలలను రోజుకు మూడు సార్లు శాటినేషన్ చేయాలన్నారు. పిల్లల తల్లితండ్రులు తప్పనిసరిగా కోవిడ్ వేక్సిన్ వేయించుకొనే విధంగా చైతన్య పరచాలని సూచించారు. పదిశాతం పాజిటివిటీ కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను తెరవవద్దని ఆదేశించారు. మనబడి నాడూ-నేడు రెండో దశ పనులు సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయని, దీనికోసం ప్రాధమికంగా జిల్లాలో 884 పాఠశాలలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్ వి రమణకుమారి, డిఇఓ జి.నాగమణి, ఏపిసి డి.కీర్తి తదితరులు పాల్గొన్నారు.